చిన్నతనంలోనే అమ్మానాన్న ప్రేమానురాగాలకు దూరమైన ఆ అక్కాతమ్ముడికి.. ఒకరంటే ఒకరికి అంతులేని ఆపేక్ష. ఆ తమ్ముడు తన అక్కను తండ్రిలాగా బాధ్యతగా చూసుకున్నాడు. ఆ అక్క తన తమ్ముడిని అమ్మలాగా లాలనతో చూసుకున్నది. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకరికొకరు ‘రక్ష’గా నిలబడ్డారు. చివరకు అక్కతో రాఖీ కట్టించుకోకుండానే తమ్ముడు భౌతికంగా వెళ్లిపోయాడు. ‘ఒరేయ్ తమ్ముడూ.. లేవరా..’ అంటూ, తన తమ్ముడి చేతిని కన్నీటితో తడుపుతూ ఆ అక్క ‘చివరి’ రాఖీ కట్టింది!
కూసుమంచి, ఆగస్టు 7 : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురానికి చెందిన పందిరి అప్పిరెడ్డి (24) వృత్తిరీత్యా పొైక్లెనర్ ఆపరేటర్. అతడికి అక్క జ్యోతి ఉంది. అప్పిరెడ్డి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రికి అనారోగ్యం కారణంగా నానమ్మ వద్దనే పెరిగాడు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమైన ఆ అక్కాతమ్ముళ్లకు ఒకరంటే ఒకరికి అంతులేని ఆపేక్ష. అతడిని ఆమె తల్లిలా లాలనగా చూసుకుంది. ఆమెను అతడు తండ్రిలా బాధ్యతగా చూసుకున్నాడు.
ఇంతలోనే అప్పిరెడ్డికి జ్వరం సోకింది. బంధువులు స్థానిక దవాఖానకు తరలించగా డెంగీ జ్వరంగా వైద్యులు నిర్ధారించారు. విషయం తెలియగానే జ్యోతి వచ్చేసరికి తమ్ముడు దవాఖానలో బెడ్‌పై చికిత్స పొందుతూ కనిపించాడు. దీంతో ఉబికొస్తున్న కన్నీటిని దిగమింగుతూ.. బుధవారం రాఖీ తీసుకొచ్చింది. ఆమె వచ్చేసరికే అప్పిరెడ్డి కన్ను మూయడంతో గుండె పగిలేలా ఏడ్చింది. కిష్టాపురంలో గురువారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు.. ‘ఒరేయ్ తమ్ముడూ.. రాఖీ కట్టడానికి వచ్చాను.. లేవరా..?’ అంటూ చేతికి ‘చివరి’ రాఖీ కట్టింది. ఈ దృశ్యం చూపరులకు కన్నీరు తెప్పించింది.