Khamenei | (స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. ఆయన మృతికి ఇజ్రాయెల్ ప్రయోగించిన అత్యాధునికమైన ఓ మెరుపులాంటి ఆయుధమే కారణమని తాజాగా తెలిసింది. ‘బ్లూ స్పారో’గా పిలుస్తున్న ఈ క్షిపణిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది.
ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ వర్గాలు ‘రోదసి నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణి’గా అభివర్ణిస్తాయి. ఎఫ్-15 వంటి ఫైటర్ జెట్స్ నుంచి ప్రయోగించే ఈ మిసైల్ భీకర వేగంతో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది.
తొలుత భూమి నుంచి వాతావరణం అంచుల వరకూ.. ఆ తర్వాత అక్కడి నుంచి ఉపరితలం మీదున్న లక్ష్యాల మీదకు అత్యంత వేగంతో ఈ క్షిపణి దూసుకొస్తుండటంతో రాడార్లతో దీన్ని గుర్తించడం కష్టమని నిపుణులు చెప్తున్నారు. బ్లూ స్పారో రాకను శత్రు దేశాలు గుర్తించి, స్పందించే లోపే విధ్వంసం జరిగిపోతుందని అంటున్నారు. అందుకే, ఖమేనీ మృతి సాధ్యమైందని చెప్తున్నారు. దాడుల సమయంలో పశ్చిమ ఇరాక్‌లో బ్లూ స్పారో శకలాలు కొన్ని పడినట్టు, దీంతో ఖమేనీ మృతికి ఈ క్షిపణే కారణమని నిర్ధారించినట్టు సమాచారం. ‘బ్లూ స్పారో’తో పాటు ఇజ్రాయెల్ దగ్గర బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయి.

పేరు: బ్లూ స్పారో
రకం: బాలిస్టిక్ క్షిపణి
పొడవు: 6.5 మీటర్లు
బరువు: 1900 కిలోలు
తయారీ సంస్థ: రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇజ్రాయెల్
వాహకం: ఎఫ్-15 వంటి ఫైటర్ జెట్లు
సామర్థ్యం: 1,995 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం చేయగలదు
ప్రత్యేకత: రాడార్లు పసిగట్టకుండా ఉపరితలం నుంచి వాతావరణం అంచు వరకూ.. అక్కడి నుంచి భూతలం మీద ఉన్న లక్ష్యం వైపు ప్రయాణిస్తుంది.