మల్కాజిగిరి, ఆగస్టు 11: వక్ఫ్ భూముల రికార్డుల సమస్యలకు మోక్షం లభించింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కృషి ఫలించింది. మల్కాజిగిరిలోని పదివేల మంది ఆస్తి యజమానులకు ఊరట కలిగింది. సుధీర్ఘకాలంగా వక్ఫ్ భూముల రికార్డుల సమస్యలను పరిష్కరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరిలోని సర్వే నంబర్లు పొరపాటుగా 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన విషయంపై ఎమ్మెల్యే చొరవచూపి సంబంధిత ఆధార పత్రాలు, అధికార రికార్డుల సమర్పణతో సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ మేరకు మల్కాజిగిరి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు, మల్లాపూర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారికంగా గుర్తించింది. 2026 జూలై 29న జారీ చేసిన కమ్యూనికేషన్లో సర్వే నంబర్లు 3, 103, 104, 105, 145, 146, 147, 148 నుంచి 154 వరకు మల్లాపూర్ గ్రామానికి చెందినవని, సంబంధిత గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మిగిలిన సర్వే నంబర్లు మల్కాజిగిరి గ్రామానికి చెందినవిగా వక్ఫ్‌బోర్డు నమోదు చేసింది.. వక్ఫ్‌బోర్డు ఆస్తుల జాబితాపై స్పష్టత, ధ్రువీకరణ కోసం తెలంగాణ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ వివరణ కోరిన విషయం కూడా వక్ఫ్‌బోర్డు నమోదు చేసింది.
ప్రభావిత సర్వే నంబర్లను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి వినతిని వక్ఫ్‌బోర్డు ప్రధానంగా పరిగణలోకి తీసుకుంది. పూర్తి సమగ్రంగా పరిశీలించిన అనంతరం గెజిట్‌లో అవసరమైన సవరణలు చేసి, సంబంధిత మార్పులను అధికార గెజిట్‌లో ప్రచురించేందుకు వక్ఫ్‌బోర్డు తదుపరి చర్యలు చేపట్టింది. గత గెజిట్‌లో పేర్కొన్న నంబర్ 35, 37, తదితర గెజిట్ నోటిఫికేషన్ల మధ్య వ్యత్యాసాలు పరిశీలించి, సవరణలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యను స్వయంగా స్వీకరించి, సంబంధిత అధికారులతో నిరంతరం చర్చిస్తూ, సమర్థవంతంగా పనిచేసి, ఆధారాలు, రికార్డులను పరిశీలించేలా కృషిచేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు అధికారులకు సమస్యలను తెలియజేసి, వారికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి, సమస్య తీవ్రతను తెలియజేసినందుకు మల్కాజిగిరి నిషేధిత ఆస్తి యాజమానులు రుణపడి ఉంటామని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే దొరకడం అదృష్టంగా భావిస్తామన్నారు.
ప్రజల ఇబ్బందులు గుర్తించాం… పొరపోటున నమోదు చేసిన నిషేధిత ఆస్తులతో తాము పడుతున్న బాధలను నా దృష్టికి తీసుకువచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లు గుర్తించి, పోరాటం చేశాను. వారికి మద్దతుగా సరైన పత్రాలు, రికార్డులు సమర్పించడంతోపాటు, అధికారులతో సమన్వయం చేశాం. వేలాది మంది ఆస్తి యాజమానుల సమస్యను అధికారులకు తెలియజేశాను. దీంతో వక్ఫ్‌బోర్డు నిషేధిత జాబితా మార్పులకు చర్యలు చేపట్టింది. మల్కాజిగిరి ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తాను. అంకితభావంతో పనిచేస్తే అసాధ్యమనేది ఉండదు. నా బాధ్యతగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉంటూ, నిరంతర పోరాటం చేస్తాను.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే