– ఏన్కూరు పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్బాబు తనిఖీ
– జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పరిశీలన
– సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన
కారేపల్లి (ఏన్కూరు), సెప్టెంబర్ 25 : ఏన్కూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్ బాబు శుక్రవారం సందర్శించారు. పీహెచ్సీలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తనిఖీ చేశారు. ప్రస్తుతం ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు,చికిత్సలు, ఇతర వైద్య సదుపాయాలను సకాలంలో అందించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ తనిఖీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బాలకృష్ణతో పాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.