Nepal PM | కాఠ్మాండూ: నేపాల్లో గాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధికారం దిశగా దూసుకుపోతున్నది. దేశంలో జెన్ జీ నిరసనలు జరిగి ఓలీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో కొత్త పార్టీ ఆర్ఎస్పీ ముందంజలో ఉన్నది. మొత్తం 165 నియోజకవర్గాల్లో 144 స్థానాల ఫలితాలు వెలువడుతుండగా.. అందులో ఆర్ఎస్సీ మూడు సీట్లను గెల్చుకోగా, 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
కాఠ్మాండూ మేయర్గా ఉన్న బాలేంద్ర షా.. జాపా-5 నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, సీపీఎన్-యూఎంఎల్ అధ్యక్షుడు, నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీపై ఆధిక్యంలో ఉన్నారు. కాగా, వృత్తిపరంగా ఇంజినీర్ అయిన 35 ఏండ్ల బాలేంద్ర షా నేపాల్ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. అస్థిరతకు మారుపేరుగా ఉన్న నేపాల్లో గత 18 ఏండ్ల వ్యవధిలో 14 ప్రభుత్వాలు మారాయి. నేపాల్ ఎన్నికల ఫలితాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. ఆ దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని భారత్ కోరుకుంటున్నది.