ఓటుహక్కు విషయంలో నగర, పట్టణవాసులది ఎప్పుడూ చిన్నచూపు వైఖరే కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్(సర్) కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు తిరిగి అందించడంలో పట్టణ ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 84.18 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. ఖమ్మం నియోజకవర్గంలో అత్యల్పంగా 69.51 శాతం మాత్రమే పూర్తయింది. డిజిటలైజేషన్ ప్రక్రియ ముగియడానికి ఆగస్టు 3వ తేదీ చివరి గడువుకావడంతో అప్పటిలోగా పూర్తి అవుతుందా లేదా అని జిల్లా అధికార
యంత్రాంగం సందిగ్ధంలో పడింది.
– మామిళ్లగూడెం, జూలై 25
ప్రజాసామ్యం, ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేదా? రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం లాంటి ఓటుహక్కు అంటే చిన్నచూపా? ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా ఉండే ఓటుహక్కును దక్కించుకునేందుకు చదువుకున్నవారు, పట్టణ, నగరవాసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. ఓటుహక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేసేందుకు భారత ఎన్నికల కమిషన్ రూ.కోట్లు ఖర్చు చేసి మరీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో సైతం బీఎల్వోలకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించడంలో పట్టణ ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత రెండునెలలుగా జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం పెద్దఎత్తున ప్రచారం చేయడంతోపాటు స్థానిక బీఎల్వోల ఆధ్వర్యంలో ముందస్తు సర్వే నిర్వహించి ఓటర్లకు సమాచారాన్ని అందించారు. అయినా జిల్లాలో ఓటర్ల ఎన్యూమరేషన్ కార్యక్రమం ఆశించినస్థాయిలో ముందుకుసాగడం లేదు.
సా..గుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియ
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు వందశాతం ఎన్యూమరేషన్ ఫారాలను స్థానిక బీఎల్వోలు, బీఎల్ఏల ద్వారా అందించారు. ఓటర్లు 2002 ఓటరు జాబితా ప్రకారం, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫారాలను నింపి స్థానిక బీఎల్వోలకు అందించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన బీఎల్వోలకు ఓటర్లు వాటిని నింపి తిరిగి అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో కాస్త వేగంగానే కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 84.18 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. జిల్లాలోని ఐదు అసెంబ్లీల పరిధిలో అత్యధికంగా పాలేరు-90.16 శాతం, అత్యల్పంగా ఖమ్మం-69.51 డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. సత్తుపల్లి-89.94, వైరా-89.21, మధిర-88.33 శాతం డిజిటలైజేషన్ను శనివారం సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ముగియడానికి ఆగస్టు 3వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే గడువును పొడిగించిన ఎన్నికల సంఘం మరోమారు పొడిగింపు ఉండదని తేల్చిచెప్పింది. దీంతో గడువులోపు డిజిటలైజేషన్ పూర్తి అవుతుందా లేదా అని జిల్లా అధికార యంత్రాంగం అయోమయంలో ఉంది.
గ్రామీణ ఓటర్లలో చైతన్యం.. పట్టణ ఓటర్లలో నైరాశ్యం
ఎన్నికల ప్రక్రియ ఏదైనా గ్రామీణ ఓటర్లలో చైతన్యం ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలోనూ గ్రామీణ ఓటర్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటున్నారు.. కానీ, పట్టణ ఓటర్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ కాలనీల్లో అన్నిరకాల వసతులు కల్పించాలని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు కానీ, ఎన్నికలప్పుడు మాత్రం పోలింగ్లో పాల్గొనకుండా ఇండ్లకే పరిమితమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తమకు దక్కాలనే ఆశతో చురుగ్గా వ్యవహరించడం గమనార్హం. పట్టణ ప్రాంతాల ఓటర్లు ఓటరుకార్డును కేవలం ఒక ప్రభుత్వ గుర్తింపుకార్డుగానే భావిస్తున్నారు తప్ప.. ఓటుహక్కు విలువను పట్టించుకోకపోవడం బాధాకరం.