ములుగు, జూలై 25(నమస్తేతెలంగాణ) : ములుగు జిల్లా మత్స్యశాఖలో అధికారుల మధ్య వాటాల పంచాయితీ నెలకొంది. మేడారం మహా జాతర సందర్భంగా జంపన్నవాగుతో పాటు పరిసర ప్రాంతాల్లో పనిచేసిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో కీచులాటలు మొదలయ్యా యి. రాష్ట్రప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా గజ ఈతగాళ్లకు రూ.24 లక్షలను 15 రోజుల క్రితం విడుదల చేయగా, వాటి పంపిణీలో ఇద్దరు అధికారులకు కమీషన్ల లొల్లి మొదలైంది. జిల్లా స్థాయి అధికారి వద్ద ఉండాల్సిన కార్యాలయ బ్యాంకు ఖాతాకు చెందిన ఐడీ, పాస్వర్డ్ కాంట్రాక్టు ఉద్యోగి దగ్గర పెట్టుకొని ఇన్చార్జిగా వచ్చిన జిల్లా స్థాయి అధికారికి ఇవ్వకుండా సతాయిస్తున్నట్లు తెలిసింది.
శుక్రవారం మత్స్యశాఖ కార్యాలయంలో ఇన్చార్జి డీఎఫ్‌వో(డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్) భాస్కర్‌కు కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఎఫ్‌ఎఫ్‌వో(ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్) పాముల రమేశ్‌కు తీవ్రమైన వాగ్వాదం జరిగి వాటాల పంచాయతీ బయట పడింది. జిల్లాలో మత్స్యశాఖ కార్యాలయం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జి అధికారులే బాధ్యత వహిస్తున్నారు. గతంలో జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహించిన సాల్మాన్రాజ్ జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ పొందగా ఆయన స్థానంలో మహబూబాబాద్ డీఎఫ్‌వోగా పనిచేస్తున్న భాస్కర్‌కు ములుగు ఇన్చార్జి డీఎఫ్‌వోగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
అదేవిధంగా కార్యాలయం ఏర్పడినప్పటి నుంచి ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్‌గా సామల రమేశ్ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ గతంలో పనిచేసిన జిల్లా స్థాయి అధికారులను మచ్చిక చేసుకొని అంతా తానై వ్యవహరిస్తున్నాడు. మేడారం జాతరలో గజ ఈతగాళ్లతో పాటు మత్స్యకారులు అందించే సంక్షేమ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్యాలయ బ్యాంకు ఖాతాకు చెందిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను దగ్గర ఉంచుకొని అవకతవకలకు పాల్పడుతున్నాడు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఈ నెల 14వ తేదీన రమేశ్‌ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు బదిలీ చేశారు. అయినా అక్కడికి వెళ్లకుండా ములుగులోనే తిష్టవేసి ప్రస్తుతం గజ ఈతగాళ్లకు మంజూరైన రూ. 24 లక్షల పంపిణీలో అంతా తానై వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
రూ.24లక్షల పంపిణీలో కమీషన్ల లొల్లి
ఇన్చార్జి డీఎఫ్‌వోతో పాటు ఎఫ్ఎఫ్వోకు ప్రభుత్వం నుంచి గజ ఈతగాళ్లకు పంపిణీ చేయా ల్సిన రూ.24 లక్షల్లో కమిషన్ల లొల్లి మొదలైంది. ఎఫ్‌ఎఫ్‌వో రమేశ్ యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌ను దగ్గర పెట్టుకొని డీఎఫ్‌వోకు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వా గ్వాదం జరిగి డీఎఫ్‌వో బదిలీ అయిన స్థానానికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ ఎఫ్ఎఫ్వోకు కవరింగ్ లెటర్‌ను అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తీసుకోకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి పంపించినట్లు తెలిసింది. మేడారం మహాజాతరలో భక్తుల రక్షణార్థం సుమారు 200మంది గజ ఈతగాళ్లను నియమించి వారం రోజులపాటు వారికి ఒక్కొక్కరి చొప్పున రూ.800 చొప్పున అందించడంతో పాటు భోజన వసతి సౌకర్యాలతో పాటు లైవ్ జాకెట్స్, ఇతర సామగ్రి కోసం ఖర్చు చేయాల్సిన రూ.24 లక్షలు ప్రస్తుతం విడుదల కావడంతో వాటి పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది.
50 నుంచి 100మంది గజ ఈతగాళ్లను మాత్రమే నియమించి మిగిలిన వారి పేర్లపై డబ్బులు కాజేసే యత్నంలోనే గొడవలు జరుగుతున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన మత్స్యకారులకు ప్రభుత్వం ద్వారా 38 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలతోపాటు సొసైటీలకు మంజూరైన 11ద్విచక్ర వాహనాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి జిల్లాకు శాశ్వత మత్స్యశాఖ అధికారిని నియమించి మేడారం జాతరలో శాఖకు సంబంధించిన అవకతవకలపై విచారణ జరిపించాలని మత్స్యకారులు కోరుతున్నారు.