మహబూబ్‌నగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎట్టకేలకు కృష్ణా నదికి వరదలు మొదలైంది. రెండు నెలల తర్వాత కృష్ణానదికి ఆశించిన స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రతోపాటు కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం కృష్ణా నదికి భారీగా ఇన్‌ఫ్ల్లో నమోదైంది. ఉదయం నమోదైన ఇన్‌ఫ్ల్లో సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. అయితే కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తివేయడంతో ప్రస్తుతం ఆ నీటిని నారాయణపూర్‌లోకి నిల్వ చేస్తున్నారు. వరద వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నారాయణపూర్ నుంచి 24,650 క్యూసెక్కుల వరదను దిగువకు పంపిస్తున్నారు. ఈ జలాలు తెలంగాణను తాకడానికి మరో 24గంటలు పట్టే అవకాశం ఉంది.
ఇంజినీర్ల అంచనా ప్రకారం ఆదివారం సాయంత్రం కృష్ణానది వరద తెలంగాణలోకి వచ్చి చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఎగువ నుంచి వరద వస్తుందని సమాచారంతో జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా గతేడాది మే చివరి వారంలోనే కృష్ణానదికి భారీగా వరదలు వచ్చాయి. జూలై చివరి నాటికి జూరాల ప్రాజెక్టు గేట్లు అనేకసార్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేవారు. కానీ ఈఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కృష్ణానదిలో చుక్క నీరు లేకుండా పోయింది. మే చివరి వారంలో జూన్ రెండో వారం వరకు కృష్ణా నది స్వల్ప వరదలు వచ్చాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జలాలను ఒడిసిపట్టలేక చేతులెత్తేసింది. తాజాగా వస్తున్న వరదలతో తాగునీటికి మాత్రం ఢోకాలేని పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.
అల్మట్టి జలాశయం నుంచి..
కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 24 గంటల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. 84,888 క్యూసెక్కులు ఇన్‌ఫ్ల్లో నమోదు కాగా 67,500 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నదిలోకి 35,000 క్యూసెక్కులను నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత 108.660 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్ డ్యామ్‌లో ప్రస్తుత నీటిమట్టం 491.96మీటర్లు కాగా ప్రస్తుతం 31.96 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. తాజాగా 25,560 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో కట్టిన బ్యారేజీలన్నీ నిండి కిందికి వచ్చే వరకు తెలంగాణకు పదివేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ నీళ్లు కూడా తెలంగాణలోకి అడుగు పెట్టడానికి మరో 24 గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
30 టీఎంసీలకు చేరిన తుంగభద్ర డ్యాం
అయిజ, జూలై 24 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాం నీటి నిల్వ 30టీఎంసీలకు చేరుకున్నది. ఎగువన ఉన్న తుంగ డ్యాం నుంచి తుంగభద్ర డ్యాంనకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 11,420 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,574 క్యూసెక్కులు ఉంది. గరిష్ఠ స్థాయి నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1606.03 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 30.385 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యామ్ సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.