Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పదేండ్ల పాలనలో కేసీఆర్ వివిధ రంగాల అభివృద్ధికి వేసిన పునాదులు, నాడు చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించిన ఎకో టూరిజం పార్క్!
కేసీఆర్ హయాంలో దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో, రూ.వంద కోట్ల వ్యయంతో ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకుని కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, విదేశీ పక్షులతో కూడిన పక్షిశాల, గ్రీనరీ వంటి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోనే పార్క్ సంబంధించిన పనులు ప్రారంభించింది. దీంతో మహానగర జంట జలాశయాలకు సమీపంలో ఎకో టూరిజం హాట్‌స్పాట్‌గా మారుతుందని, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతానికి గుర్తింపు వస్తుందని భావించారు. బీఆర్ఎస్ పాలనలో దాదాపు 90% పనులు పూర్తి చేశారు. మిగిలిన 10% పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండున్నరేండ్లు పట్టింది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఎకో పార్క్‌ను ప్రారంభించారు.
కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా హెచ్ఎండీఏ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2022లో పార్కు పనుల శంకుస్థాపన సందర్భంగా అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేరుతో ఏర్పాటుచేసిన శిలాఫలకానికి అధికారులు తెల్లబట్ట కప్పి, చెట్ల కొమ్మలను అడ్డుగా వేసి కనిపించకుండా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా అధికారులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శిలాఫలకాలను కనిపించకుండా చేసినంత మాత్రాన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనిపించకుండా పోదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.