High Court | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ కింద ఎన్సీసీ కంపెనీ చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు శుక్రవారం ఆగ్ర హం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి నా అమలుచేయకపోవడంపై నిలదీసింది. కోర్టు ఉత్తర్వులను ఎందువల్ల అమలు చేయలేకపోయారో కనీసం వివరణ ఇవ్వలేదని, కోర్టు ఉత్తర్వులంటే ఎలాంటి గౌరవం ఉన్నట్టు లేదని వ్యాఖ్యానించింది. పనులు చేసిన కంపెనీకి బిల్లులు చెల్లించకపోతే ఆ కంపెనీని ఎలా నిర్వహించాలని, ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించింది.
ఈ నెల 13లోగా బిల్లులు చెల్లించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసి నివేదిక సమర్పించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి రూ.180.17 కోట్ల బిల్లుల్లో ఆమోదించిన వాటిని చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదని తెలుపుతూ ఎన్సీసీ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ పీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2015లో భగీరథ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని తెలిపారు. పనులకు సంబంధించి టోకెన్లు జారీచేయడం మినహా బిల్లులు చెల్లించడంలేదని చెప్పారు. ఈ బిల్లులను 6శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించినా అమలు చేయలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 13లోగా గత ఉత్తర్వులను అమలు చేసి నివేదికను సమర్పించాలని, లేకుంటే సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించారు.
చేప పిల్లలను సరఫరా చేసినవారికి ఈ నెల 10లోగా బిల్లులు చెల్లించాలని మరో కేసులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2023-24లో చేప పిల్లల సరఫరా చేసినవారికి బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసినా అమలు చేయకపోవడంపై కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు బిల్లుల సొమ్మును వినియోగించామన్న ప్రభుత్వ న్యాయవాది వాదనపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10లోగా బిల్లులు చెల్లించకపోతే సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు.