సూర్యోదయానికి ముందే పొలాలకు బయలుదేరి, మట్టిని మచ్చిక చేసుకుంటారు. విత్తనాలతో ఆశలు నాటుతారు. కానీ ఆ ఆశలు చాలాసార్లు తీరవు. పంట చేతికొచ్చేసరికి అప్పులే మిగులుతాయి. పుట్టెడు ధాన్యం పండించే అదే రైతు పట్టెడన్నం లేక ఆకలితో, అప్పుల బారినపడి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆశయంతో ‘సుభిక్ష అగ్రి ఫౌండేషన్’ ఉద్భవించింది. వారికి న్యాయంగా రావలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేసి, తమ వంతుగా పిల్లల చదువు, ఆర్థిక స్వావలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తుందీ సంస్థ.
భారత దేశంలో అప్పుల పాలై గంటకో రైతు తన ప్రాణం తీసుకుంటున్నాడని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇంటి పెద్ద పోతే ఆ కుటుంబాలకు దిక్కెవరు?! వాళ్లని ఎవరు పట్టించుకోవాలి?!.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘సుభిక్ష అగ్రి ఫౌండేషన్’. ఆత్మహత్య చేసుకున్న రైతులు కొందరికి వివిధ కారణాల వల్ల ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందదు. ఆ మహిళలకు వితంతు పింఛన్ కూడా దక్కదు. ఇలాంటప్పుడు సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అవసరం అయితే వారి తరఫున న్యాయ పోరాటం చేయడంలాంటివి ఈ సంస్థ ప్రధాన విధుల్లో కొన్ని. అంతేకాదు తమ వంతుగా, రైతుల పిల్లలకు విద్యా పరంగా సహాయం, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు ఈ సంస్థ సభ్యులు. ఇప్పటి వరకు దీని ద్వారా 200 విద్యార్థులు లబ్ధి పొందారు. మహిళా రైతులకు వివిధ చేతి వృత్తులు నేర్పుతూ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నైపుణ్య శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. రైతు కుటుంబాలకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థను కొందరు మిత్రులతో కలిసి హైదరాబాద్‌లో 2016లో ఏర్పాటు చేశారు ఐటీ నిపుణుడు రాంబాబు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడు.

ఈ ఫౌండేషన్ ద్వారా తమ జీవితాలను మెరుగు పరచుకున్న మహిళలు వాళ్ల కథలు చెబుతుంటారు. ‘2020లో నా భర్త చనిపోయిండు. ఇద్దరు చిన్న బిడ్డలను పోషించుకుంటూ ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తున్నాను. ఇప్పటి వరకు వితంతు ఫించన్ గానీ ఇల్లు కానీ లేదు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించలేదు. సుభిక్ష వారు రెండు పాడి పశువులను ఇచ్చి, పిల్లల చదువుకు సాయం చేశారు. ఎప్పటికప్పుడు మా సమస్యలు తెలుసుకుంటారు’ అంటూ తన బాధల నుంచి కొంత ఓదార్పు పొందిన సిద్దిపేట జిల్లాకు చెందిన గుగులోత్ స్వరూప చెప్పుకొచ్చింది. నారాయణ పేట జిల్లా, దామరగిద్దకు చెందిన వెంకటమ్మది మరో కథ ‘మా ఇంటాయన పంట పెట్టుబడికి అప్పులు చేసి తీర్చ లేక, అప్పులిచ్చిన వారి అవమానాలు భరించ లేక మమ్మల్ని వదిలేసి పోయిండు. మా కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నపుడు సుభిక్ష వాళ్లు వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు. పిండి గిర్నీ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు దంపుడు కారం తయారు చేస్తూ రోజుకు మూడు వందల వరకు సంపాదిస్తూ, పొలం పనులు చేసుకుంటున్నాను.’ అని చెబుతుందామె.
ఇంటి పెద్ద దిక్కుకు ఆపద వచ్చినప్పుడు కేవలం నష్టపరిహారం అందిస్తే సమస్య తీరిపోదు. మిగిలిన వాళ్లకు బతికేందుకు దారి చూపాలి. అందుకే సుభిక్ష ఆ కుటుంబానికి ఉపాధి బాటలు వేస్తుంది. సిద్దిపేట జిల్లాలో ఉండే గీకూరు నిర్మలకు భర్త పేరున ఉన్న పొలం మ్యుటేషన్‌కు సాయపడి, పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడామె పొలం పనులు చేస్తూ, పాలు అమ్మి పిల్లల్ని చదివించుకుంటున్నది. జనగామలో పదిమంది మహిళలను ఒక గ్రూప్‌గా ఏర్పరచి వివిధ రకాల పొడులు, మిల్లెట్ బిస్కెట్లు తయారు చేసే యూనిట్ పెట్టించారు. వారి ఉత్పత్తులను తగిన ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడంతో ప్రతీవారం ఆదాయం పొందుతున్నారు. మరో 50 మంది మహిళకు కుటీర పరిశ్రమల స్థాపనకు శిక్షణనిచ్చి, నిధులు సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలను మాత్రమే కాదు, మొత్తం గ్రామీణ వ్యవసాయ జీవన విధానాన్ని స్థిరంగా మార్చాలన్న దృక్పథంతో సుభిక్ష ముందుకు సాగుతున్నది.‘గత పదేండ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంట దిగుబడులను మార్కెట్ చేయడంలో సుభిక్ష సంస్థ ప్రతినిధులు అండగా నిలుస్తున్నారు’ అంటూ తన సేంద్రియ ప్రయాణాన్ని వివరించారు నారాయణపేటజిల్లాకి చెందిన రైతు కూర్మయ్య.

ఈ ఫౌండేషన్ ప్రతి రైతు కుటుంబాన్ని పరిశీలించడానికి వలంటీర్లను నియమించింది. వాళ్లు పరిస్థితిని పరిశీలించి, అవసరమైన విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు. పిల్లల చదువు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో కూడా తల్లిదండ్రుల భుజానికి భుజం కలిపే దృక్పథంతో పనిచేస్తారు. ఇప్పటి వరకూ ఇలా 250 రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా సాయం అందించారు. ప్రస్తుతం సుభిక్ష తోడున్న ప్రతి కుటుంబం సగటున 30 నుంచి 50 వేల వరకు సంవత్సర ఆదాయం సంపాదిస్తున్నది. కష్టాల్లో ఉన్న మహిళా రైతులకు ఎలాంటి సహాయం కావాలన్నా సుభిక్షను (897732576) సంప్రదించవచ్చు. కుటుంబాన్ని చక్కగా నడుపుకోవడానికి కావలసిన దన్నును పొందవచ్చు.