మిషన్ డోలో పూర్తిగా ముగియడంతో కీసర శ్రీరామలింగేశ్వస్వామిని దర్శించుకొన్న రుద్ర అండ్ టీమ్ అక్కడే గుట్ట మీద కాసేపు సేదతీరారు. సూర్యాస్తమయమై.. పడమరన ఎర్రగా ఉన్న ఆకాశం క్రమంగా నల్లబారుతున్నది. ఇంతలో హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి ఆకాశాన్ని చూస్తూ ఎంతో తన్మయత్వంతో.. ‘పడమర ఒడిలో భాస్కరుడు విశ్రాంతి తీసుకోగా.. నిశీధి తన నల్లటి చీరను ఆకాశానికి పరవగా.. ఆ నల్లటి చీరపై వెండిపూలు తారల్లా వికసించి ఈ రేయికే కొత్త అందాలు తెచ్చాయి. సిటీలో కాలుష్యం వల్ల ఈ దృశ్యం నా నయనానికి ద్విగుణీకృతం కాలేదాయే!!’ అంటూ మురిసిపోతున్నాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన డీసీపీ సత్యనారాయణ.. ‘రామస్వామి గారూ.. కవిత్వం దంచేస్తున్నారుగా!’ అంటూ నవ్వారు. డీసీపీని చూడగానే తనను తాను తమాయించుకొన్న రామస్వామి.. ‘సార్.. సార్.. సారీ.. మిమ్మల్ని గమనించలేదు’ అంటూ కాస్త వెనక్కి జరుగబోతుండగా.. మరేం పర్వాలేదు అంటూ రామస్వామిని దగ్గరగా తీసుకొన్న సత్యనారాయణ.. ఆయన చేతులను పట్టుకొంటూ.. ‘ఇంకో ఏడాదిలో రిటైర్మెంట్ కాబోతున్నారు. ఈ ఏజ్‌లో కూడా ఇంతటి సాహసోపేతమైన ఆపరేషన్‌లో పాల్గొనడం చాలా గ్రేట్. మీకు నా సెల్యూట్’ అంటూ రామస్వామిని సత్యనారాయణ పొగిడాడు. చెమ్మగిల్లిన కండ్లతో రెండు చేతులు జోడించిన రామస్వామి.. ‘నాదేం లేదు సార్. మా రుద్ర బాబు గైడెన్స్‌లో అందరం కలిసి పనిచేశాం. ఈ మంచి పనికి దేవుడి కృప తోడైంది అంతే’ అంటూ వినమ్రంగా అన్నాడు.
చిన్నగా నవ్విన సత్యనారాయణ.. టీం మెంబర్స్ కరణ్, జయ, స్నేహిల్ను అభినందించాడు. చిన్న వయసులోనే ఇంతటి పెద్ద ప్రాజెక్టులో భాగమైన హరిశ్వను ప్రత్యేకంగా ప్రశంసించాడు. రుద్రను దగ్గరకు తీసుకొని కౌగిలించుకొంటూ.. ‘వెల్డన్ మై బాయ్.. నా నమ్మకాన్ని నిలబెట్టావ్. 150 కోట్ల మంది భారత పౌరులను కాపాడావ్. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ’ అంటూ మెచ్చుకొన్నాడు. ఈ మిషన్‌కు అన్నిరకాల సహాయ, సహాకారాలను అందించినందుకు, ముఖ్యంగా చివర్లో కరెక్ట్ టైమ్‌కు ఎంటరై ఏఐ అవతార్ ఆటకట్టించడంలో సాయపడినందుకు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేసిన రుద్ర.. అంతా దేవుడి దయ వల్లేనంటూ ముగించాడు. అందరూ అదేమాట అన్నారు. కానీ, ఒక్కరు తప్ప. అతనే హరిశ్వ. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న ఓ సాధువు గమనిస్తూనే ఉన్నాడు. ఇంతలో చిరుజల్లులు మొదలయ్యాయి.
ఇంతలో ఆ సాధువు హరిశ్వ దగ్గరికి వచ్చి.. ‘ఏం బాబూ.. నువ్వు దేవుడిని నమ్మవా?’ సూటిగా ప్రశ్నించాడు. ఎవరా అని అటు వైపు తిరిగిన టీమ్ మెంబర్స్ సాధువుకు నమస్కరించారు. ఇంతలో సాధువు అడిగిన ప్రశ్నకు హరిశ్వ స్పందిస్తూ.. ‘కంటికి కనిపించేవాటినే నేను నమ్ముతా..స్వామీ’ అంటూ అంతే సూటిగా బదులిచ్చాడు. ‘అంటే?’ మళ్లీ కొనసాగించాడు సాధువు. ‘అంటే ఏముందండీ? ఇతను మా రుద్ర సార్.. ఎంతో జీనియస్.
ఆయన టీమ్ మెంబర్స్ కూడా తెలివిపరులే. దీన్ని నేను ఎక్కడైనా ఒప్పుకొంటా. నల్లమల అనే ఓ పెద్ద కేసును ఎంతో విజ్ఞతతో చేధించిన ఈ రుద్ర సార్ అండ్ టీమ్.. చివరికి ఆ క్రెడిట్‌ను ఆ పరమేశ్వరుడికి ఇచ్చారు. ఇప్పుడు కూడా అంతే, ఓ వైరస్ నుంచి దేశ పౌరులను ఆ కాశీ విశ్వేశ్వరుడే కాపాడాడంటూ టీమ్ అంతా ఒకటే గోల. అసలు కాపాడింది ఎవరు? మనుషులు. అంటే మేము. ఎంతో ఆలోచించి, మరెంతో కష్టపడి ఈ మిషన్‌ను మేమంతా కలిసి ఆపేశాం. దాన్ని పక్కనబెట్టి ఏంటి ఇదంతా? ఇప్పుడు కూడా అంతే, మళ్లీ కీసరలోని శివుడికి మరోసారి క్రెడిట్ ఇస్తున్నారు. అదే బాగోలేదు’ అంటూ చెప్తూపోయాడు హరిశ్వ.
చిన్నగా నవ్విన సాధువు.. ‘బాబూ.. మీ టీమ్ దేవుడికి క్రెడిట్ ఇస్తున్నారని నీకు కోపమా? లేక ఈశ్వరుడు ఒక్కడికే ఇస్తున్నారనా?’ అన్న సాధువు ప్రశ్నకు అక్కడ అంతా నిశ్శబ్దం. ‘నాకు శైవ, వైష్ణవ ఇలా.. వర్గబేధమేమీలేదు. అసలు దేవుడే లేడని నమ్మేవాడిని నేను. ఉంటే కనిపించాలిగా!’ హరిశ్వ కాస్త ఉద్వేగభరితుడయ్యాడు. ‘కనిపిస్తే దేవుడు ఉన్నట్టేనా?’ సాధువు ప్రశ్నకు అవునన్నట్టు తలూపాడు హరిశ్వ. ‘ఎడారిలో ఎండమావి అదే మిరాజ్.. నీళ్లు ఉన్నట్టు భ్రాంతి కలిగిస్తుంది. నిజంగా అక్కడ నీళ్లు ఉన్నట్టామరి?’ అన్న సాధువు ప్రశ్నకు ఆలోచనలో పడ్డాడు హరిశ్వ.
‘బాబూ.. నీ పేరు?’ అంటూ సాధువు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు హరిశ్వ. దీంతో మళ్లీ కొనసాగించిన సాధువు.. ‘హరిశ్వ అంటే హరి+ఈశ్వరుడు. ఈ మిషన్‌లో నిన్ను తీసుకోవడంలోనూ ఆ దైవకృప ఉంది బాబూ.. అంతెందుకు, మీరు చెప్తున్న డోలో మిషన్‌ను ఛేదించడానికి మొదట ఉప్పందించిందే ఆ శ్రీహరి. మిషన్‌కు చెల్లుచీటీని ఇచ్చింది ఈశ్వరుడు. గుర్తుచేసుకోండి ఓసారి?’ అంటూ టీమ్ మెంబర్స్‌తో అన్న సాధువు.. తాను చెప్తుంది ఏంటో అర్థంకావాలంటే ఓ 30 అడుగుల ముందుకు అందర్నీ రమ్మన్నాడు.
టీమ్ మెంబర్స్ అలా వచ్చారో లేదో.. ఇంతకు ముందు వాళ్లు నిల్చున్న ప్రాంతంలో ఓ పెద్ద పిడుగు పడింది. అంతే, వెనక్కి చూస్తూ అందరూ ఒక్కసారిగా హడలిపోయారు. త్రుటిలో పెద్ద అపాయం నుంచి తమను కాపాడారంటూ ఇటు సాధువు వైపునకు తిరగ్గానే.. అక్కడ ఎవ్వరూ లేరు. టీమ్ మెంబర్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఇంతలో రాత్రి ఏడున్నరకు కీసర రామలింగేశ్వరుడికి చివరి హారతినిస్తున్న గంటల శబ్దం అందరి చెవుల్లో మార్మోగింది. హరి-హరులే సాధువు రూపంలో తమను పిడుగుపాటు నుంచి కాపాడారంటూ టీమ్ మెంబర్స్ అందరూ ఆ హరిశ్వరుడిని వేడుకొన్నారు. టీమ్‌లోని హరిశ్వతో సహా..!! అది పక్కనపెడితే, ‘డోలో మిషన్‌ను ఛేదించడానికి మొదట ఉప్పందించిందే శ్రీహరి. మిషన్‌కు చెల్లుచీటీని ఇచ్చింది ఈశ్వరుడే’ అని సాధువు ఎందుకు అన్నాడో అర్థమయ్యిందా?
కంచిలోని వరదరాజ పెరుమాళ్ టెంపుల్లో ఉన్న శ్రీహరి విగ్రహం కింద ఉన్న చీటీలోనే డోలో మిషన్ ఎక్కడ మొదలవుతుందో రాసి ఉంది. దాన్ని బట్టే రుద్ర అండ్ టీమ్ మిషన్‌ను చేధించడం మొదలుపెట్టారు. ఇక, చివర్లో బయోకెమీ క్రియేచర్ను కాశీ (శివుడు), ఏఐ అవతార్ ఏర్పాటు చేసిన వైరస్‌ను కీసర (శివుడు)లో రుద్ర అండ్ టీమ్ కట్టడిచేశారు. అందుకే, ‘డోలో మిషన్‌ను ఛేదించడానికి మొదట ఉప్పందించిందే శ్రీహరి. మిషన్‌కు చెల్లుచీటీని ఇచ్చింది ఈశ్వరుడు’ అని సాధువు అన్నాడు.
– రాజశేఖర్ కడవేర్గు