న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు సోమవారం నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. దీంతో చెక్ క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, ఉపసంహరణ వంటి బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. సమ్మెతో ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, పాతకాలం నాటి ప్రైవేట్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకుల వినియోగదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే డిజిటల్ సేవలు, ఇతర ఆన్లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు యథావిధిగా ఈ మూడు రోజులూ పనిచేస్తాయి. వినియోగదారులకు కలుగనున్న అసౌకర్యానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు విచారం వ్యక్తం చేస్తూ వారు తమ నగదు అవసరాల కోసం ఏటీఎంలు/ఏడీడబ్ల్యూఎంలను ఆశ్రయించాలని సూచించాయి. అలాగే యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, యోనో సేవలను వినియోగించుకోవాలని కోరాయి. ఈ సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) హెచ్చరించింది. వారానికి ఐదు రోజుల పనిదినాల గురించి తాము ఎన్నో ఏండ్లుగా చేస్తున్న డిమాండ్ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) ప్రధాన కార్యదర్శి రూపమ్ రాయ్ తెలిపారు.