Cloudburst : ఉత్తరకాశీ (Uttarkasi) జిల్లాలోని ధరాలీ (Dharali) గ్రామాన్ని ఇటీవల జలప్రళయం పెను విషాదంలోకి నెట్టింది. ఖీర్ గఢ్, భాగీరథీ నదులు ఉప్పొంగడంతో వరద నీరు ఒక్కసారిగా గ్రామాన్ని ముంచెత్తింది. పూర్తిగా పర్వత ప్రాంతాల్లో ఉన్న ధరాలీ గ్రామం బురదలో కూరుకుపోయింది. వరదలో పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇళ్లను బురద కప్పేసింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు.
దాంతో గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ అపరేషన్ కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కూడా తనవంతు సహకారం అందిస్తోంది. ధరాలీ గ్రామానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రెస్క్యూ టీమ్స్‌కు ఇస్తోంది. ఆ శాటిలైట్ చిత్రాల ఆధారంగా గ్రామంలో భవనాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి బురద తొలగిస్తున్నారు. బురదలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఇస్రో ఇస్తున్న శాటిలైట్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన అత్యాధునిక పరికరాలను యుద్ధ ప్రాతిపదికన విమానాల్లో ధరాలీ గ్రామానికి తరలిస్తున్నట్టు అధికారులు వివరించారు. కాగా గంగోత్రికి వెళ్లే యాత్రికులు మార్గమధ్యలో ధరాలీ గ్రామంలో ఆగుతుంటారు. ఈ క్రమంలో ధరాలీపై కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామాన్ని వరద ముంచెత్తింది. దాంతో పలు రోడ్లు మూతపడి యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.