సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని అడ్వర్టయిజ్మెంట్ విభాగం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నది. నిబంధనల ప్రకారం బల్దియా ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలు ఆదాయానికి గండికొడుతున్నారు.ప్రైవేట్ ఏజెన్సీలతో చేతులు కలిపి ఓ అధికారిణి భారీగా వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో కారిడార్లో అనుమతి లేని ప్రకటనల ఏజెన్సీల నుంచి సదరు అధికారిణి ఏకంగా రూ.10 లక్షల చొప్పున లంచం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. బకాయిలు చెల్లించకపోవడం, అనుమతి గడువు ముగిసినా బోర్డులు తొలగించకపోవడంపై గత జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి సదరు అధికారిణి పై మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి.
అనధికారిక బోర్డులు తొలగించాలని గత నవంబర్ 2025లో నోటీసులు జారీ చేసినా.. సదరు అధికారిణి ఆయా ఏజెన్సీ ప్రతినిధులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని అక్రమ ప్రకటనలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. శంషాబాద్ రోడ్డులో హోర్డింగ్లు, బంజారాహిల్స్ రోడ్ నం 2లోని ఎఫ్వోబీలపై ఎల్ఈడీలు, వట్టినాగులపల్లి రోడ్డు, గండిపేట – శంకర్పల్లి రోడ్డు మార్గంలోనూ కాంటీలివర్ల ఏజెన్సీల నుంచి దండుకుంటున్నట్లు ప్రచారం సాగుతున్నది. విలీనమైన పురపాలికల్లో దాదాపు 35 కంపెనీలకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కోటిన్నరకు పైగా బకాయిలు..
మరోవైపు ఇదే సంస్థకు సంబంధించి ఎల్వీ ప్రసాద్ ఎఫ్ఓబీ నిర్వహణకు సంబంధించి పాత బకాయిలు భారీగా ఉన్నట్లు తెలుస్తున్నది. వార్షిక లైసెన్స్ ఫీజు, 5 శాతం పెంపుతో కలిపి రూ. 1,42,84,017 చెల్లించాలని గతంలోనే నోటీసులు ఇచ్చారు. నోటీసు అందిన 7 రోజుల్లోగా చెల్లించకపోతే అనుమతులు రద్దు చేస్తామని పేరొన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడం అధికారుల పనితీరుకు అద్దంపడుతున్నది.
అక్రమంగా కాంటీలివర్ల ఏర్పాటు
గండిపేట – శంకర్పల్లి రోడ్డు మార్గంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల జాతర కొనసాగుతోంది. ఓ ఏజెన్సీ ఎటువంటి మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే కాంటీలివర్లను ఏర్పాటు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ఫిర్యాదులు అందడంతో, ఆ అక్రమ నిర్మాణాలను తొలగించి, రావాల్సిన ఫీజులను వసూలు చేయాల్సి ఉన్నా..ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో ప్రజాధనానికి గండి పడుతున్నది. అధికారులు ఇప్పటికైనా బకాయిలు వసూలు చేసి, అక్రమ బోర్డులను తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.
అనుమతి లేకుండానే వెలుగుతున్న వెలుగులు
ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన, ముఫకం జా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉన్న ఎఫ్వోబీలు ఎల్ఈడీ డిజిటల్ బోర్డుల ప్రదర్శన కోసం ఓ ప్రముఖ యాడ్ ఏజెన్సీకి పైలట్ ప్రాజెక్ట్ కింద అనుమతి లభించింది. గడువు ముగిసినా సదరు ఏజెన్సీ అకడ వాణిజ్య ప్రకటనలను ప్రదర్శిస్తున్నది.జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ప్రకటనల విభాగం), వారం రోజుల్లోగా ఆ బోర్డులను తొలగించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసినా.. పురోగతి లేకపోవడం గమనార్హం.