పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ పొందిన అధికారులను మళ్లీ ఎందుకు కొనసాగిస్తున్నారు. అలా కొనసాగుతున్న వారు ప్రైవేట్ సైన్యంలా మారారు.
– అధికారంలోకి రాకముందు రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీసు శాఖను ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారిని ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ కొనసాగిస్తుండటంతో కొత్త వారికి అవకాశాలు దక్కకుండా పోతున్నాయి. రిటైర్మెంట్ తర్వాత పోస్టింగులు పొందిన వారిని ఉద్దేశించి ప్రైవేట్ సైన్యంలా మారారని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం ఇబ్బడిముబ్బడిగా ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ అయినవారికి అందలం ఎక్కిస్తున్నారు. ఇప్పటికే డజనుకు పైగా అధికారులు కీలకమైన స్థానాల్లో ఎక్స్‌టెన్షన్‌పై ఉండగా, తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు డీఎస్పీ క్యాడర్ అధికారుల ఎక్స్టెన్షన్ ఫైల్ సిద్ధమైంది. ఈ పరంపర ఇలాగే కొనసాగితే తమకు పదోన్నతులు కష్టమేనంటూ ప్రభుత్వం తీరును యువ ఐపీఎస్‌లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
గత కొంతకాలంగా రిటైర్ అయినవారు ఏదో ఒక విధంగా ప్రత్యేకాధికారులుగా వచ్చి మళ్లీ చేరుతున్నారు. ఐపీఎస్ అధికారులకు కేటాయించే పోస్టుల్లో కూడా రిటైర్ అయినవారే కొనసాగుతూ ఉండటంతో ఇదే శాఖలోని కొత్తవారికి మాత్రం అవకాశాలు దక్కడం లేదు. ఏండ్లకేండ్లు వారే తిష్ట వేయడంతో పోలీసు శాఖ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.. అర్హత, సామర్థ్యం ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇస్తే పర్వాలేదు. ఒకరిద్దరికి మినహాయింపు ఇవ్వవచ్చు. కానీ, అర్హత ఉన్నా, లేకపోయినా.. సమర్థతను చూడకుండా చాలా రొటీన్‌గా ఎక్స్టెన్షన్లు ఇచ్చేన్నారు. వీరికి తొలుత ఒక ఏడాది వరకు కాంట్రాక్ట్ అని ఉంటుంది.
ఆ తర్వాత వీరిని తొలగించేవారు ఉండరు. అత్యంత కీలక విభాగాల్లోనూ వీళ్లే ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తున్నారు. రిటైర్ అయినా అవే పోస్టుల్లో ఉండటంతో వారి అవినీతి, అక్రమాలు కూడా బయటకు రావడం లేదని చెప్తున్నారు. ఇదివరకు ఉన్న వారే మళ్లీ కొనసాగుతుండటం వల్ల ఉద్యోగోన్నతుల ప్రక్రియ కూడా నిలిచిపోతున్నది.
పోలీసు శాఖలో కీలకమైన పనులను చేయాలంటే సర్వీస్‌లో ఉన్న అధికారులైతే చేయరని, రిటైరైన వారిని తెచ్చిపెట్టుకొంటే తమకు ఇష్టమున్న పని చేయించుకోవచ్చని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇదే పనిచేస్తున్నారని, తమకు కావాల్సిన వారిని తెచ్చి పెట్టుకుంటున్నారని, వీరంతా ప్రభుత్వంలోని ఒక వర్గం ప్రయోజనాలకే పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరిందరికీ జీతభత్యాలు భారీగానే ఇవ్వాల్సి వస్తున్నది. పదోన్నతులు ఇవ్వకుండా.. రిటైర్ అయిన వారిని కొనసాగించడం వల్ల ప్రతినెలా ప్రభుత్వంపై రూ.కోట్లలో అదనపు భారం పడుతున్నది. వీరు కేవలం జీతభత్యాలతోనే ఆగడం లేదు.. ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండ ఉన్నందునే వారు తిరిగి అదే పోస్టులోకి రాగలిగారని, శాఖను ఇంటిలా వాడేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం వీరికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని, పోలీసు శాఖకు పదవీ విరమణ పొందిన వారి సేవలు అవసరం అని భావిస్తే పోలీసు శిక్షణ కేంద్రంలో ఉపయోగించుకోవచ్చు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.