Stone Ganesha | రాయపోల్, సెప్టెంబర్ 14 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని భారీ ఏకశిలపై చెక్కిన ఈ విగ్రహం ఎంతోకాలంగా పూజలందుకుంటుంది. రాయపోల్లోని గణపతి ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనం ఈ విగ్రహ చరిత్రకు కీలక ఆధారంగా భావిస్తున్నారు.
ప్రచురితమైన చారిత్రక వివరాల ప్రకారం.. కళ్యాణీ చాళుక్య చక్రవర్తి ఆహవనమల్ల మొదటి సోమేశ్వరుడి కాలానికి చెందిన శాసనంలో గణపతి విగ్రహానికి సంబంధించి క్రీ.శ. 1048 నాటి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో రాయపోల్ను ‘రావిప్రోలు’గా పిలిచేవారని, గావుండ హువిన అనే రాజు కుమారుడు జువ్విరెడ్డి ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రక కథనాల్లో పేర్కొన్నారు. అయితే గణపతి విగ్రహం కాల నిర్ధారణ విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది.
విగ్రహ శిల్పశైలి, లలితాసన భంగిమ, నిర్మాణ లక్షణాలను పరిశీలించిన కొందరు చరిత్ర పరిశోధకులు ఇది 8–9వ శతాబ్దాల రాష్ట్రకూటుల కాలానికి చెందినదై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాసనంలో కనిపించే కాలం, శిల్పశైలిని బట్టి అంచనా వేసే కాలం మధ్య తేడా కనిపిస్తోంది. అందువల్ల విగ్రహాన్ని ఖచ్చితంగా క్రీ.శ. 1048 నాటిదిగా నిర్ధారించడానికి ముందు శాసనాన్ని పురావస్తు, శాసన నిపుణులు అధికారికంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఈ రాతి గణపతి విగ్రహం ఐదడుగులకు పైగా ఎత్తులో ఉండటంతోపాటు లలితాసనంలో దర్శనమివ్వడం ప్రత్యేకతగా చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో చాళుక్య, రాష్ట్రకూటుల కాలానికి చెందినవిగా భావిస్తున్న మరికొన్ని శిల్పాలు, వీరగల్లులు కూడా ఉన్నట్లు పరిశోధకుల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం.
ప్రస్తుతం రాతి గణపతి ఉన్న ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.
ఆలయం వెలుపల భారీ రాతి ధ్వజస్తంభాన్ని అప్పట్లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్రకూటులు, అనంతరం కళ్యాణీ చాళుక్యుల ప్రభావాన్ని చాటే చారిత్రక ఆనవాళ్లు రాయపోల్ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో.. పురావస్తు శాఖ అధికారులు, శాసన నిపుణులు సమగ్రంగా పరిశీలిస్తే ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి