హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీలో ఉన్నతాధికారులంటే విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. విద్యాబోధన, పాలన, ఇతర అంశాల్లో తనదైన ముద్ర వేసేందుకు తపిస్తుంటారు. కానీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఓ అధికారి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. విద్యార్థుల నుంచి వసూలు చేసిన నిధులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారని, అవసరం ఉన్నా, లేకున్నా పనులు చేయించడం, కమీషన్లు నొక్కేయడం పరిపాటిగా మారిందనే చర్చ నడుస్తున్నది.
తన సొంత అవసరాలు, విలాసాల కోసం భారీ మొత్తంలో నిధులు వృథా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘విభజించు.. పాలించు’ సూత్రా న్ని పాటిస్తూ యూనివర్సిటీని చిన్నాభిన్నం చేస్తున్నారని బోధన, బోధనేతర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తాను ఎక్కడుంటే అక్కడ అంతా కొత్తగా ఉండాలని సదరు అధికారి ఆదేశాలు జారీ చేశారట. తాను ఉండే బంగ్లా, తన చాంబర్‌ను అద్దంలా తీర్చిదిద్దించుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం భారీ మొత్తంలో యూనివర్సిటీ నిధులను వెచ్చించినట్టు సమాచారం.
బంగ్లా మరమ్మతుల కోసమే రూ.70 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసింది. మొదటి అంతస్తు మాత్రమే ఉన్న ఈ భవనంలో రూ.15 లక్షలతో అత్యాధునిక లిఫ్ట్‌ను ఏర్పాటు చేయించారట. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ తొలిగించి, కొత్త వస్తువులను కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. పాత భవనానికి మరమ్మతులకు ఈ స్థాయిలో ఖర్చు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిధులతో కొత్త భవనమే నిర్మించొచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తన చాంబర్‌తోపాటు ఇతర చాంబర్లను రూ.12 లక్షలతో మరమ్మతు చేయించినట్టు తెలిసింది. మరోవైపు, యూనివర్సిటీలో పలు చోట్ల లిఫ్ట్‌ల ఏర్పాటు, పెయింటింగ్ పేరుతో అవసరానికి మించి నిధులు ఖర్చు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిఫ్టుల కోసమే రూ.88 లక్షలు వెచ్చించినట్టు చెప్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో రూ.73 లక్షలతో రెండు లిఫ్టులు, బంగ్లాలో రూ.15 లక్షలతో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసినట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌కు పెయింటింగ్ వేయించడానికి రూ.20 లక్షలు, సెమినార్ హాల్ వాల్ ప్యానెలింగ్ కోసం రూ.40 లక్షలు వెచ్చించారని తెలిసింది.
కేవలం కమీషన్ల కోసమే ఇదంతా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజు నుంచే ఆయన అక్రమార్జనకు స్కెచ్ వేసినట్టు చర్చ జరుగుతున్నది. ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయించవచ్చో ముందుగానే ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. కమీషన్ల రూపంలో భారీ మొత్తంలో దండుకొనేందుకు సివిల్వర్క్పై ఎక్కువగా దృష్టి పెట్టారని అంటున్నారు. పని ఏదైనా సరే కనీసం 6% కమీషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
గతంలో క్యాంపస్‌లో రూ.3.7 కోట్లతో సుమారు మూడు కిలోమీటర్ల మేర బీటీ రోడ్ వేయించినట్టు తెలిసింది. పలు కాలేజీల అవసరం కోసం రూ.2.88 కోట్లతో 9 బస్సులు కొనుగోలు చేశారని చెప్తున్నారు. వీటన్నింటిలోనూ భారీ మొత్తంలో కమీషన్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సదరు అధికారి ఆగడాలపై ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.