అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం – AK 47’.. అనే ప్రకటన విడుదలైన నాటినుంచీ సినిమాపై ఆడియన్స్‌లో పాజిటివ్ బజ్ మొదలైంది. అత్యంత వినోదాత్మకంగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. ముందు ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే.. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని ఓ వారం ఆలస్యంగా, అనగా.. అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే సినిమా రిలీజ్‌ను వారం రోజులు వాయిదా వేశామని, వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనమే ఈ సినిమా అని చిత్రబృందం పేర్కొన్నది. మధ్యతరగతి వ్యక్తిగా వెంకటేశ్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి కథానాయిక. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావురమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ కీలకపాత్రధారులు.