అపర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఇప్పుడు ఫలాలు అందిస్తున్నది. ఉమ్మడి పాలనలో తాగునీటికి అల్లాడి తడారిన తెలంగాణ గొంతును కేసీఆర్ తన కలల పథకం మిషన్ భగీరథతో తడిపారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీగా రూపొందించిన మిషన్ భగీరథ పథకం ఇప్పుడు ఊరూరా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌కు వరప్రదాయనిగా మారనుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల నగరానికి తాగునీరందించే సింగూరు, మంజీరాలో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. దీంతో జలమండలి అధికారులు మిషన్ భగీరథ నుంచి నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగర ప్రజలకు కూడా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా నగరానికి తాగునీటిని తీసుకొస్తుండటం కేసీఆర్ విజన్‌కు నిదర్శనంగా నిలుస్తున్నది. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని భావించి నాటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ ఇప్పుడు నగరానికి చేరనుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జలమండలి అన్ని ప్రాజెక్టులు కలిపి ప్రతి రోజు 583 ఎంజీడీల నీటిని సేకరిస్తున్నది. అందులో 22 ఎంజీడీల నీటిని ఇప్పటికే మిషన్ భగీరథకు అందిస్తున్నది. ఆ నీటిని మేడ్చల్, యాదాద్రి భువనగరి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 561 ఎంజీడీల నీటిని గ్రేటర్ హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నది. అయితే నగరానికి నీళ్లందించే సింగూరు, మంజీరాలో డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నది. ప్రస్తుతానికి సింగూరు నుంచి ప్రతి రోజు 70 ఎంజీడీలు, మంజీరా నుంచి 40 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో సింగూరులో ప్రస్తుమున్న నీళ్లు మరో రెండున్నర నెలలకు మాత్రమే సరిపోనున్నాయి. ఈనేపథ్యంలో దాన్ని భర్తీ చేసేందుకు మిషన్ భగీరథకు ఇస్తున్న 22 ఎంజీడీలతో పాటు మరో 20 ఎంజీడీల నీటిని అదనంగా సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 42 ఎంజీడీలు మిషన్ భగీరథ నుంచే సేకరించేందుకు జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సింగూరు, మంజీరా నుంచి వచ్చే నీటిలో సగం నీటిని కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ నుంచి తీసుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుకు సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లపై ఇప్పటికే దృష్టిసారించారు. మల్లన్నసాగర్ నుంచి ఘనపూర్‌కు భగీరథ పైపులైన్ పనులు చేస్తున్నారు. ఆ పైపులైన్ పనులు పూర్తి చేయగానే భగీరథ నుంచి 42 ఎంజీడీల నీటి తరలింపు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్ భగీరథ నుంచి ఈ నీళ్లను తరలిస్తే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కార్వాన్, రాజేంద్రనగర్, పటాన్చెరు ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య తీరనుంది.
సింగూరు, మంజీరాకు ప్రత్యామ్నాయంపై దృష్టి
ప్రతిరోజు సింగూరు నుంచి 70 ఎంజీడీలు, మంజీరా నుంచి 40 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు. మొత్తం 110 ఎంజీడీలలో 10 ఎంజీడీలు ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. మిగిలిన 100 ఎంజీడీలు నగరానికి వస్తున్నది. ఆ రెండు ప్రాజెక్టుల్లో మరో రెండున్నర నెలలకు మాత్రమే సరిపడా నీళ్లున్నాయి. ప్రత్యామ్నాయంగా 80 ఎంజీడీల నీటిని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మిషన్ భగీరథ నుంచి సేకరించే 42 ఎంజీడీలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు.
కృష్ణా ఫేజ్1, 2, 3లు కలిపి మరో 35 ఎంజీడీలను తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా మరో 5 ఎంజీడీలు ప్రెషర్ ఫిల్టర్ ద్వారా సేకరించి సింగూరు, మంజీరాకు ప్రత్యామ్నాయంగా మొత్తం 80 ఎంజీడీలు డిసెంబర్ నాటికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే నవంబర్ చివరి నాటికి నగరానికి తాగు నీటి కటకట మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగవంతం చేశారు. మరోవైపు నీటి పొదుపుపై నగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. నీటిని వృథా చేసేవారిపై జరిమానాలు వేస్తున్నారు. నీటి ఎద్దడికి సిద్ధంగా ఉండేలా ప్రజలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు.