గద్వాల/ధరూర్, సెప్టెంబర్ 22 : జూరాల నీటిని సాగుకు ఇవ్వాలని ఆందోళన బాట పట్టిన రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు రెండోరోజూ కొనసాగాయి. మంగళవారం జోగుళాంబ గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత కుర్వ పల్లయ్యతోపాటు కౌన్సిలర్లు సంటెన్న, నర్సింహులు, నాయకులు బీచుపల్లి, రఘును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొన్నారు. మంగళవారం ఎలాంటి ధర్నాలకు పిలుపు ఇవ్వకపోయినా తమను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని హనుమంతు పోలీసులను నిలదీశారు. వారి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే గద్వాల ఎమ్మెల్యే పుట్టిన రోజు సంబురాల్లో మునిగిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత పల్లయ్య మాట్లాడుతూ జూరాలకు నీటిని విడుదల చేయకుండా రేవంత్రెడ్డి.. రైతుల కండ్లల్లో కన్నీళ్లు కారేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా పాలనలో పోలీసుల పహారాలు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులపై ఆంక్షలు ఎందుకని నిలదీశారు.

జూరాల ప్రాజెక్ట్ నుంచి కుడి కాలువకు సాగునీరు విడుదల చేయాలని మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి, భీంపురం గ్రామాలకు చెందిన రైతులు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. వారం రోజులుగా పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు అందించాలని కోరుతున్నా.. అధికారులు, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు.