తెలంగాణకు సాగు, తాగునీరు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు తెస్తే వాటిని ఎట్లా రద్దు చేస్తరు? ప్రాజెక్టుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ఇంజినీర్లు ఎందుకు పట్టించుకుంటలేరు? తెలంగాణ అనుమతులను రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎకడిది? దాన్ని ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎకడిది?
జీఆర్ఎంబీ ఎజెండాను చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒకరికైనా కడుపు మండుతది. రక్తం మరుగుతది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎజెండా వస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నట్టు? తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసేలా.. రాష్ర్టానికి సాగు, తాగునీరు దకకుండా కుట్రలతో కూడిన ఎజెండా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రం పండ్లు తోముతున్నదా? లేక నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టదలుచుకున్నదా?
– హరీశ్‌రావు
తెలంగాణకు గోదావరి నీటి హక్కులు దక్కకుండా ఏపీ సర్కార్ చేస్తున్న కుట్రలు.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని జీఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ రాయడం, వాటిపై పునఃసమీక్షకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎజెండాలో పెట్టడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే కుట్రలు జరుగుతుంటే రాష్ట్ర ఇంజినీర్లు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌనం వెనుక మర్మమేమిటి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా? ఇంకేదైనా మతలబు ఉన్న దా?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఎజెండాలో చేర్చిన అంశాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఆర్ఎంబీ సమావేశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే జరుగుతున్నట్టు కనిపిస్తున్నదని, ఏపీ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు ఉన్నాయని మండిపడ్డారు. జీఆర్ఎంబీ ఎజెండా రెండు రాష్ట్రాలకు సర్యులేట్ అయి వారం గడుస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం కనీసం కండ్లు తెరువలేదని, ఇది చాతకాని దద్దమ్మ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నదనే సోయి లేకనా? ఆత్మగౌరవం లేకనా? లేక గురుదక్షిణ చెల్లించడానికా? అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం నీటి హకులను కాలరాసే విధంగా కుట్రలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ‘ప్రతిపక్షాలపై విరుచుకుపడే నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వతంగా సమాధి కడుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు అంటే భయమా, గురుదక్షిణా, భక్తా?’ అని ఎద్దేవా చేశారు.
ఈ నెల 18న జరుగనున్న జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసే అంశాలు ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతలు (240 టీఎంసీలు), చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు (0.8 టీఎంసీ), చిన్నకాళేశ్వరం (4.8 టీఎంసీలు), చనాకా-కొరటా (1.2 టీఎంసీలు), మోడికుంట వాగు ప్రాజెక్టు (2.047 టీఎంసీలు), కడెంగూడెం ఎత్తిపోతలు (3 టీఎంసీలు), సీతారామ ప్రాజెక్టు (67.5 టీఎంసీలు)కు కేసీఆర్ అనుమతులు తెస్తే, ఆ అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ ప్రతిపాదించి జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టించిందని చెప్పారు. ‘ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ ప్రజల నోటికాడి బుక లాకోండి’ అని ఏపీ చెప్తుంటే, జీఆర్ఎంబీ అమలుచేస్తున్న ఈ ఎజెండాను ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ఇంజినీర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని, ఇంజినీర్లు చెప్పినా రేవంత్‌రెడ్డి మౌనం గా ఉన్నారా? అని హరీశ్‌రావు నిలదీశారు. ‘రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎకడిది, ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎకడిది?’ అని ప్రశ్నించారు. తెలంగాణ సాగునీరు, తాగునీరు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ పట్టుబట్టి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు తెస్తే వాటిని ఎలా రద్దు చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లలో ఒక టీఎంసీకి కూడా క్లియరెన్స్ తేలేదని, ఒక ప్రాజెక్టుకు కూడా అనుమతి రాలేదని విమర్శించారు. సమ్మక, పాలమూరు ఎత్తిపోతల, వార్ధా డీపీఆర్ వాపస్ వచ్చాయని దుయ్యబట్టారు. ఇది చేతకని దద్దమ్మ ప్రభుత్వమని, అధికారులు నాయకులు నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు. రేవంత్ సర్కార్‌లో అందరూ కలిసి తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ తెచ్చుడు….రేవంత్ ఇడిసిపెట్టుడు!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జన్మదినం రోజున కూడా మహారాష్ట్రకు వెళ్లి ప్రాజెక్టుల కోసం ప్రయత్నించారని, ఆయన హయాంలో ఉద్యమం నడిపి, పోరాడి సాధించుకున్న 383 టీఎంసీల గోదావరి నీటి కేటాయింపులు, అనుమతులు ఇప్పుడు కాంగ్రెస్ పాలనా వైఫల్యం వల్ల రద్దయ్యే ప్రమాదం ఏర్పడిందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఎంతో కమిట్మెంట్తో తెచ్చిన ప్రాజెక్టులను, నీటిని సీఎం రేవంత్‌రెడ్డి ఒడిపిపట్టుకోకుండా ఆంధ్రాకు విడిచిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మక బరాజ్‌పై ఏపీ అభ్యంతరం చెప్తున్నదనే కారణంతో ఆ బరాజ్ అంశాలను బోర్డు ముందు చర్చకు పెట్టడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పుకొంటున్న చంద్రబాబు.. మరోవైపు కేంద్రానికి లేఖలు రాసి, జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్పించి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయించేందుకు కుట్ర పన్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. టీవీల్లో ప్రాజెక్ట్‌లను అడ్డుకోలేదని చెప్తూనే, ప్రాజెక్టుల రద్దుకు తెరవెనుక రాజకీయం చేస్తాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలకూ చేతలకు పొంతన లేదని, ఇది ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. నీటిపారుదల శాఖలో కీలక స్థానాల్లో ఉన్నవారంతా ఆంధ్రా మూలాలు ఉన్న వారేనని, వారంతా తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం చేస్తుంటే తెలంగాణ హకులను కాపాడాల్సిన అధికారులు, ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల విషయంలో జీఆర్ఎంబీ ఆధికార పరిధి మహావృక్షంలో ఆకంత మాత్రమేనని, ఇది ఎవరి అండ చూసుకొని తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేసేంతవరకు వెళ్లిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. గోదావరిపై కేసీఆర్ ఏడు ప్రాజెక్టులకు అనుమతులు తేస్తే వాటిని రద్దు చేయాలని ఏపీ డిమాండ్ చేస్తున్నదని మండిపడ్డారు. దేశ చరిత్రలో మొదటిసారి తెలంగాణకు వచ్చిన ఏడు ప్రాజెక్టుల అనుమతులపై రివ్యూ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే, వాటిని జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చిందని పేర్కొన్నారు. దీనిని చూస్తే కుక తోకను ఆడిస్తున్నదా? లేక తోక కుకను ఆడిస్తున్నదా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా? జీఆర్ఎంబీ పెద్దదా? అని నిలదీశారు. ఎజెండా సెట్ చేసే ధైర్యం ఏపీకీ, జీఆర్ఎంబీకి ఎకడిదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు జరుగుతున్న ఆన్యాయంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు భయపడి బీజేపీ స్పందించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ కలిసిన తర్వాత, సమ్మక-సారక (సమ్మకసాగర్) ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ వాటా నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందనే వార్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నోరు విప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కర్ణాటక సమావేశం, తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ పరిణామాల అనంతరం సమ్మకసాగర్ ప్రాజెక్టుకు చెందిన 47 టీఎంసీల మన రాష్ట్ర వాటాను ఏపీ కోసం వదులుకోవడానికి రేవంత్‌రెడ్డి సిద్ధపడ్డారంటూ ప్రచారం జరుగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. గోదావరి యాజమాన్య బోర్డు ఎజెండాలో సమ్మకసాగర్ కు 47 టీఎంసీలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంటే, తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఈ 47 టీఎంసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుందో, వదులుకోలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఎంతో కష్టపడి సమ్మక సాగర్ ప్రాజెక్టు 47 టీఎంసీలకు సంబంధించి అవసరమైన అన్నిరకాల కేంద్ర అనుమతులు తీసుకొచ్చామని హరీశ్ గుర్తుచేశారు. ఈ నీటి కేటాయింపులు ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గానికీ ప్రయోజనం కలిగిస్తాయని, అలాంటి కీలక ప్రాజెక్టు వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వదులుకుంటుందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం అనుమతులు రద్దు అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడమేనని, సీతారామను అడ్డుకోవడమంటే ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడమేనని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం అంటే సగం తెలంగాణ, గూ డెం అంటే మంచిర్యాల, మోడికుంట వాగు అంటే ఖమ్మం, చిన్నకాళేశ్వరం అంటే మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గం.. ఇలా 7 ప్రాజెక్టులను అడ్డుకోవడం అంటే తెలంగాణలో తాగు, సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరును దూరం చేసే కుట్ర అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాలను సరిగా వాడటం లేదని, గోదావరి నీళ్లను ఎత్తిపోయడం లేదని విమర్శించారు. ఇంత జరుగుతున్నా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఎందుకు మౌనం గా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.