హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నిలదీతతో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగమాగం అయ్యారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు. హరీశ్ లేవనెత్తిన అసలు విషయాలపై మాట్లాడకుండా అసంబద్ధ వాదనలకు దిగారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఏపీ సర్కార్ కోరడం, 18వ బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా దానిని జీఆర్ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు) చేర్చడంపై హరీశ్‌రావు నిలదీశారు. దీంతో సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మంత్రి ఉత్తమ్ పొంతనలేని వాదనలతో బీఆర్ఎస్పైనే ఎదురుదాడికి దిగారు.
ఢిల్లీలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఆగమేఘాల మీద పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపెడుతూ వింత వాదనలకు దిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి బేసిన్లో దాదాపు 7ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులను తీసుకొచ్చింది. కాళేశ్వరం, చనాక కొరాట, చిన్నకాళేశ్వరం, చౌట్పల్లి హన్మంతరెడ్డి తదితర కీలక ప్రాజెక్టులు అందులో ఉన్నాయి.
గోదావరిలో తెలంగాణకు నీళ్లే లేవని, ఆయా ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులన్నీ సమీక్షించి రద్దు చేయాలని ఏపీ సర్కార్ ఇటీవల జీఆర్ఎంబీకి ప్రతిపాదించింది. బోర్డు సైతం ఏపీ ప్రతిపాదిత అంశాలను 18వ బోర్డు మీటింగ్ ఎజెండాలో జీఆర్ఎంబీ చేర్చింది. వాస్తవంగా ఆయా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరుచేసే క్రమంలో జీఆర్ఎంబీలో గతంలోనే చర్చ కొనసాగింది. ఆ తర్వాతే కేంద్రం అనుమతులను మంజూరుచేసింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కేంద్రం ఇచ్చిన అనుమతులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడం, దానికి వత్తాసు పలుకుతూ ఎజెండాలో బోర్డు చేర్చడం చర్చనీయాంశమైంది.
ఎజెండా అంశం, తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంపై హరీశ్‌రావు నిలదీసిన తర్వాతే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హడావుడి చేశారు. ఢిల్లీ నుంచే పత్రికా ప్రకటన విడుదల చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఎజెండా అంశాన్ని, ప్రభుత్వం తీసుకొన్న చర్యలను అందులో వివరించకుండా, తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ వ్యతిరేకించడం, బోర్డులో చర్చ జరుగడం కొత్తేమీ కాదంటూ సమర్థించుకునే ప్రయత్నమే చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. రాష్ట్ర నీటి హకులను పరిరక్షించి, కాపాడేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదని మొక్కుబడిగా ప్రకటించారే తప్ప.. ఎజెండా తొలగింపునకు ప్రయత్నిస్తామని అందులో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీసిన హరీశ్‌రావు, బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటిలాగానే రొడ్డకొట్టుడు ఆరోపణలకే దిగారు. జీఆర్ఎంబీ ఎజెండా అంశాన్ని వదిలిపెట్టి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు అసంబద్ధమైన వాదనలకు దిగారు. ఏపీ ప్రాజెక్ట్‌లకు బీఆర్ఎస్ పార్టీయే మద్దతిచ్చిందని అసత్యారోపణలకు దిగారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైంది, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయింది బీఆర్ఎస్ హయాంలోనే అంటూ అసంబద్ధ వాదనలకు దిగారు. ఎజెండా అంశాలు కొత్తవేమీ కాదని సమర్థించుకునే యత్నం చేశారు.
కేంద్రప్రభుత్వం, జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఏర్పడకుండా తమ ప్రభుత్వమే అడ్డుకొన్నదని, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఎన్వోసీని తీసుకొచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎంను మూడుసార్లు కలిశామంటూ ప్రగల్భాలు పలికారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతులు తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందని మంత్రి ఉత్తమ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం-బనకచర్లపై వెనువెంటనే స్పందించామని, సీఎం రెండుసార్లు, మంత్రిగా తాను 7సార్లు , 10సార్లు ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ 19 సార్లు వంటి వివిధ స్థాయిల అధికారులను కలిశామని, సుప్రీంకోర్ట్ ఎదుట వాదనలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఆర్డీఎస్ ఆధునీకరణకు ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించామని, కృష్ణాజలాల వాటా కోసం స్వయంగా ట్రిబ్యునల్ విచారణకు హాజరై న్యాయ నిపుణులకు సూచనలు చేశానని ప్రకటనలో మంత్రి సొంతడబ్బా కొట్టుకున్నారు. ఇన్ని అనుమతులు తెచ్చామని చెప్పుకొన్న అదే మంత్రి ఉత్తమ్.. వీటినే రద్దు చేయాలని ఏపీ కోరిన విషయాలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. కాళేశ్వరంపై తమ ఆరోపణలపై జవాబు చెప్పాలని మళ్లీ పొంతనలేని వాదనలకు దిగారు. అంతేతప్ప హరీశ్‌రావు సంధించిన ఒక్క ప్రశ్నకూ సూటిగా ఒక్క జవాబును మంత్రి ఉత్తమ్ తన ప్రకటనలో పేర్కొనలేదు.
జీఆర్ఎంబీ భేటీ ఎజెండా ప్రతి తన వద్దకు వచ్చినా తెలంగాణ సర్కార్ ఇప్పటివరకూ స్పందించని విషయమై హరీశ్‌రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యాన్ని, బోర్డు ఏకపక్ష వైఖరిని హరీశ్‌రావు నిలదీశారు. తక్షణం తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులపై ఏపీ ప్రతిపాదిత అంశాలను ఎజెండాను తొలగించాలని, దీనిపై ప్రభు త్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.