న్యూఢిల్లీ, మార్చి 14: దేశంలో గ్యాస్ సంక్షోభం ముదురుతున్నది. సమస్యను అధిగమించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూను తగ్గించుకోవడం, ఆహార పదార్థాల రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టగా కొన్ని రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్యి వంటి సంప్రదాయ వంట పద్ధతులకు మరలాయి. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో చిన్న హోటళ్లు మూతపడుతుండగా ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో అక్రమంగా నిల్వచేసిన ఎల్పీజీ స్థావరాలపై అధికారులు దాడులు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రెస్టారెంట్లలో కార్పొరేట్ విందు సమావేశాలు, గ్రూపు పార్టీలు నిలిచిపోయాయి. ఎల్పీజీ కొరత కారణంగా పెద్ద సంఖ్యలో అతిథులకు విందును సమకూర్చడం తమకు సాధ్యం కాదని నిత్యం రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్‌లోని రెస్టారెంట్ల యజమానులు చేతులెత్తేస్తున్నారు. తక్కువగా గ్యాస్ ఖర్చయ్యే వంటకాలనే తమ మెనూలో ఉంచినట్లు ఫ్లేవర్స్ ఆఫ్ చైనా హోటల్ యజమాని పరంజీత్ కౌర్ చెప్పారు. మరోవైపు గ్యాస్ కోసం పడిగాపులు కాస్తూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పంజాబ్‌లో శుక్రవారం ఒకరు ప్రాణాలు కోల్పోగా, తాజాగా యూపీలో ఓ వృద్ధుడు మరణించాడు.
అక్రమ నిల్వలపై దాడులు
వివిధ రాష్ర్టాల్లో ఎల్పీజీని అక్రమంగా నిల్వ చేసిన స్థావరాలపై అధికారులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించేందుకు అక్రమంగా గృహవినియోగ ఎల్పీజీని నిల్వచేసిన స్థావరంపై దాడి చేసిన కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు 316 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న కోలార్ జిల్లాలోని కేజీఎఫ్‌లో ఓ గ్యాస్ ఏజెన్సీపై అధికారులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ 1,483 ప్రదేశాలపై దాడులు చేసి వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. మొత్తం 24 ఎఫ్ఐఆర్లు రాష్ట్రంలో నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో ఎల్పీజీ కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరి నిలబడ్డారు.
గ్యాస్ స్టాకును తనిఖీ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 25 కేంద్రాలను తనిఖీ చేశాయి. సిలిండర్ల కొరతకు నిరసనగా కోల్‌కతాలోని కామర్హటి మున్సిపల్ కౌన్సిలర్ బిమల్ సాహా ఓ గ్యాస్ ఏజెన్సీ వెలుపల నిలబడిన ప్రజలకు పిడకలను పంపిణీ చేశారు. బెంగాల్‌లోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మెనూను తగ్గించడంతోపాటు కట్టెలు, బొగ్గుల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. ఎల్పీజీతో నడిచే ఆటోలు చాలా జిల్లాల్లో కనుమరుగయ్యాయి. తమిళనాడులోని చెన్నైతోపాటు ఇతర నగరాల్లో రెస్టారెంట్లు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను పాటిస్తున్నాయి. ఇండక్షన్ స్టవ్‌లతో వంటకాలను తయారుచేస్తున్నట్లు చెన్నైకు చెందిన ఓ ప్రముఖ హోటల్ చెయిన్ యజమాని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఆతిథ్య, ఆహార సేవా రంగం పూర్తిగా మూతపడకుండా నివారించేందుకు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను వెంటనే పరిమితంగానైనా పునరుద్ధరించాలని భోపాల్‌లోని అఖిల భారత వర్తకుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థించింది.
కేరళలో వలస కార్మికుల ఇంటిబాట
కేరళలో ఎల్పీజీ సంక్షోభం వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యే పరిస్థితిని కల్పించింది. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు సొంత ఇంటి బాట పడుతున్నారు. రంజాన్ పండుగ దగ్గరపడుతుండడం, పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో అక్కడి వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఆఫర్
ఎలక్ట్రిక్ స్టవ్‌లు వాడే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ షాపులకు యూనిట్ విద్యుత్తుకు రూ. 2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన వాణిజ్య ఎల్పీజీ ఆంక్షలు కొనసాగినంత కాలం ఈ సబ్సిడీ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. హైవేలు, నగరాల్లో ఉండే అనేక ధాబాలు, చిన్న హోటళ్లు సంప్రదాయ బొగ్గుతో మండే భట్టీలకు మరలుతున్నాయి. బొగ్గుకు మళ్లీ డిమాండు పెరిగిందని ఢిల్లీకి చెందిన బొగ్గు వ్యాపారి దీపక్ ఖండేల్వాల్ తెలిపారు.
ఢిల్లీలో ఎల్పీజీ కోసం బారులు
దేశ రాజధాని ఢిల్లీలో వంటగ్యాస్ కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వెలుపల బారులు తీరారు. ఎల్పీజీ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వదంతులు వ్యాపించడంతో భయాందోళన చెందిన ప్రజలు భారీ సంఖ్యలో ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకున్నారు. ప్రజలను అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. గంటల కొద్దీ నిలబడాల్సి రావడంతో అసహనానికి గురైన ప్రజలు ఏజెన్సీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఢిల్లీ గేటులోని ఎల్పీజీ ఏజెన్సీ వద్ద కనిపించింది. ఆన్లైన్ బుకింగ్ విధానం పనిచేయడం లేదని, పంపిణీదారులకు ఫోన్ చేసినా స్పందన లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు.
యూపీలో 70 ఏండ్ల వృద్ధుడి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఓ గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి వద్ద ఎల్పీజీ సిలిండర్ కోసం ఎదురుచూస్తూ ఓ 70 ఏండ్ల వృద్ధుడు గుండెపోటుకు గురై మరణించాడు. గర్హ ఖాన్ ఖానా ప్రాంతానికి చెందిన ముఖ్తియార్ అహ్మద్ అనే ఎంబ్రాయిడరీ కార్మికుడు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి వెలుపల ఎల్పీజీ సిలిండర్ కోసం ఎదురుచూస్తూ హఠాత్తుగా ఛాతి నొప్పితో కూలిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సీపీఆర్ నిర్వహించి ఆ వృద్ధుడిని దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతుడికి ఐదుగురు కుమార్తెలు సహా ఏడుగురు పిల్లలు, భార్య ఉన్నారు.