చండ్రుగొండ, ఆగస్టు 05 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆదినారాయణ చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామానికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బురద నీటిలో నిలబడి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చండ్రుగొండ నుండి గుర్రంగూడెం గ్రామానికి వెళ్లాలంటే గుంతలు గుంతలుగా రోడ్డు తయారైందన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మీటర్ లోతు నీళ్లు నిలిచి రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. గ్రామంలోని రైతులు తమ వ్యవసాయ భూములకు మోటార్ సైకిల్, ఆటోలపై మందు కట్టలు, ఎరువులు తీసుకెళ్లాలంటే నానా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం విద్యార్థులు బురద నీటిలో పడుతూ పాఠశాలలకు వెళ్లలేకపోతున్నట్లు వెల్లడించారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేయకపోతే చండ్రుగొండ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.