Rakul Preet Singh | హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇటీవల వార్తలలో తెగ నిలుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ సోదాలకు సంబంధించి కూడా రకుల్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే తనపై వస్తున్న వార్తలపై రకుల్ స్పందిస్తూ.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఆ సోదాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా తన పేరును ఈ వ్యవహారంతో ముడిపెట్టి వార్తలు ప్రచురించారని ఆమె పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారం తన ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను సాయుధ దళాల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని, ఎంతో కష్టపడి తన కెరీర్‌ను నిర్మించుకున్నానని రకుల్ తెలిపింది.
తనకు 20 ఏళ్ల వయసు నుంచే పన్నులు చెల్లిస్తున్నానని పేర్కొంది. చట్టబద్ధంగా తన ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్నానని ఆమె చెప్పింది. అంతేకాకుండా అక్రమ విదేశీ నగదు బదిలీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని రకుల్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కానీ, ఏదైనా నిర్మాణ సంస్థ తరఫున కానీ ఇలాంటి అక్రమ లావాదేవీల్లో తాను పాల్గొనలేదని వెల్లడించింది. భారత్‌లో కానీ, విదేశాల్లో కానీ మరెవరిపేరుతోనైనా బినామీ ఆస్తులు కలిగి ఉన్నానన్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించింది. తనపై వచ్చిన వార్తలను “తప్పుడు, దురుద్దేశపూరితమైన, ఊహాజనిత కథనాలు”గా రకుల్ అభివర్ణించింది. ఇలాంటి వార్తలను ప్రచురించిన వారు వాటిని ఉపసంహరించుకుని వాస్తవాలను స్పష్టం చేయాలని ఆమె కోరింది.
మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాల కోసం వాస్తవాలను పక్కన పెట్టకూడదని రకుల్ పేర్కొంది. వార్తల కోసం, వాణిజ్య ఒత్తిళ్లు, ఒక వ్యక్తి ప్రతిష్ఠ, వాస్తవాలు, జీవనోపాధిపై ప్రభావం చూపే స్థాయికి వెళ్లకూడదని ఆమె సూచించింది. తనపై వస్తున్న ప్రచారానికి సంబంధించి రాకుల్ ప్రీత్ సింగ్ ఇలా తన వాదనను బహిరంగంగా వెల్లడించడంతో.. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ఆమె స్పష్టం చేసినట్లయింది.