Supreme Court : మహిళలపై నేరాలకు పాల్పడే సంఘవ్యతిరేక శక్తుల గుండెల్లో భయాన్ని పుట్టించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. అసలు నేరాలే జరగకుండా చర్యలు చేపట్టడం ముఖ్యమని పేర్కొన్నది. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల (Delhi Police) కు సర్వోన్నత న్యాయస్థానం సూచనలు చేసింది.
ఇటీవల ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వరుసగా చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన తీరుపై పలు సూచనలు చేసింది. జస్టిస్ పర్దివాలా స్పందిస్తూ.. మహిళలపై దాడులకు పాల్పడే దుండగులకు తాము పట్టుబడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉండాలన్నారు. అలాంటి వాతావరణాన్ని పోలీసులు ఏర్పర్చాలని ఆదేశించారు.
నేరాలు జరగకుండా అడ్డుకునేందుకు తీసుకునే చర్యలను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా న్యాయస్థానం నొక్కి చెప్పింది. ఢిల్లీలో మహిళల భద్రతకు సంబంధించి పలు నిర్దిష్ఠ ఆదేశాలను ధర్మాసనం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని, వెలుతురు సరిగాలేని ప్రదేశాలను గుర్తించి వెంటనే లైటింగ్ సౌకర్యం మెరుగుపరచాలని సూచించింది.
అదేవిధంగా నిఘా వ్యవస్థలను పటిష్ఠం చేయాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొన్నది. దుండగులు, పోకిరీలు ఎక్కువగా గుమికూడే చట్టవిరుద్ధ తినుబండారాల కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా విద్యాసంస్థల సమీపంలో అమ్మాయిలను వేధించే వారిపై ఉక్కుపాదం మోపాలని స్పష్టంచేసింది. దేశ రాజధాని పరిధిలో మైనర్లపై జరిగిన లైంగిక దాడులతో సహా వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.
తాజా విచారణలో చేసిన సూచనల మేరకు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.