ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగా భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో మోదీ అనుసరించిన వైఖరి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ఇజ్రాయెల్ వెళ్లిన మోదీ ఆ దేశ ప్రధాని నెతన్యాహూతో అతి చనువుగా వ్యవహరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ మాతృభూమి, ఇజ్రాయెల్ పితృభూమి అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వీధి వీధిన గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు క్యూ కట్టడానికి పశ్చిమాసియా దేశాల విషయంలో అనుసరించాల్సిన విధానాల్లో మోదీ తప్పటడుగులే ప్రధాన కారణమని విదేశాంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఫిబ్రవరి చివరి వారంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ఫ్యూరీ పేరుతో యుద్ధం ప్రారంభించాయి. ఈ పరిణామం యావత్తు ప్రపంచాన్ని అత్యంత వేగంగా ఆర్థిక అత్యయిక పరిస్థితిలోకి నెట్టింది. బ్యారెల్ చమురు ధర 121 డాలర్లు దాటింది. చమురు సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయి. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆందోళనలో పడ్డాయి. ఈ ప్రభావం భారత్‌లోని ప్రతీ వీధిలోనూ కనిపిస్తున్నది. డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు నిలకడ కోల్పోవడం, కొరత కారణంగా రాజధాని ఢిల్లీ నుంచి ఆర్థిక నగరం ముంబై వరకు ప్రజాజీవనం ప్రభావితమవుతున్నది. హోటళ్లు, తినుబండారాల దుకాణాలు మూతపడుతున్నాయి, సేవలను తగ్గిస్తున్నాయి. మార్కెట్లో వంటగ్యాస్ సిలిండర్లు కనిపించడంలేదు. గ్యాస్ కొరతతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. ఎల్ఎన్జీతో నడుస్తున్న ఆటోలు, ట్యాక్సీల యజమానులు గ్యాస్ ధరలను భరించలేక చాలావరకు వరకు సేవలు నిలిపివేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ వైఫల్యం చెందడమే ఈ దుస్థితికి కారణం.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో భారతదేశం నిర్మాణాత్మక పాత్ర పోషించే అవకాశం లభించింది. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రయోజనాలను కాపాడటంలో దారుణంగా విఫలమయ్యారు. ఈ సంవత్సరం బ్రిక్స్‌కు భారతదేశం అధ్యక్షత వహిస్తున్నది. అమెరికా, ఇరాన్‌తో భారత్ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నది. ఇరాన్, రష్యాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నది. అయినప్పటికీ ప్రతీ కీలక దశలో మోదీ అనుసరించిన తీరు సమర్థనీయం కాదు. ఎందుకంటే ధైర్యమైన దౌత్యం కంటే నిశ్శబ్దం వైపే మొగ్గారు. రెండు మిత్రపక్షాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఏకపక్షంగా అమెరికా పక్షం వహించడం వల్ల వ్యూహాత్మక శూన్యత ఏర్పడింది. ఈ చర్య భారత ప్రయోజనాలను తీవ్రంగాదెబ్బతీసింది.
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యకు పునాది ఫిబ్రవరి చివరి వారంలో పడింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి కొన్ని రోజుల ముందు మోదీ విఫల విధానానికి బీజం వేశారు. ఫిబ్రవరి 25-26 తేదీలలో ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న మోదీ, ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఆలింగనం చేసుకున్నారు. ఈ పర్యటన రక్షణ, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం జరిగినట్టుగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. మోదీ పర్యటన ముగిసిన రెండు రోజుల్లోనే అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ అధినేత అలీ ఖమేనీని హత్య చేసి, సంక్షోభానికి ప్రేరేపించింది. కానీ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్ తరఫున ప్రధాని మోదీ ఒక్కసారి కూడా బహిరంగ ప్రకటన చేయలేదు.
యుద్ధంలో భాగస్వాములైన దేశాల నేతలకు మోదీ ఫోన్ కాల్ కూడా చేయలేదు. పశ్చిమాసియా దేశాల వ్యవహారాల్లో సంబంధం లేనట్టుగానో, తటస్థ వైఖరినో అనుసరించలేదు. ఒకవైపు మొగ్గు చూపినట్టుగా వ్యవహరించారు. నిశ్శబ్దం ద్వారా యుద్ధానికి ఆమోదం తెలిపినట్టయింది. ఇజ్రాయెల్ పర్యటన ద్వారా ఇరాన్ యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటూ విపక్షనేతలు, విదేశాంగ నిపుణులు అడుగుతున్న ప్రశ్నలు సరైనవే. మోదీ పర్యటన ఉద్దేశపూర్వకమైనా కాకపోయినా ఆ సమయం ఓ ఘోరమైన దుర్దశ అని మాత్రం చెప్పగలం.
యుద్ధం ఉధృతమైన తర్వాత నెలకొన్న నిశ్శబ్దం కూడా మరింత దారుణంగా ఉన్నది. మార్చి 3-4 తేదీలలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికాకు చెందిన జలాంతర్గామి ముంచివేసింది. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికులు చనిపోయారు. ఈ దాడి భారతదేశ సముద్ర తీరానికి దగ్గర జలాల్లోనే జరిగింది. అంతేకాకుండా దాడి జరిగిన ప్రదేశం భారత్‌కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కీలక ప్రాముఖ్యం కలిగిన ప్రాంతం. ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సమీపంలోని ఏ దేశ ప్రభుత్వమైనా ఆందోళన వ్యక్తంచేస్తూ స్పందించాలి. కనీసం ప్రకటన విడుదల చేయాలి. కానీ మోదీ ప్రభుత్వం అసలు స్పందించలేదు. నిరసన తెలుపలేదు, దర్యాప్తును కోరలేదు. కనీసం విచారం వ్యక్తంచేయలేదు. ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న మౌనం మన వైఖరిని తేటతెల్లం చేసినట్టయింది. స్వతంత్ర విధానాలు అవలంబించే దేశంగా భారతదేశానికి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసింది.
యుద్ధంపై సరైన విధంగా స్పందించేందుకు, ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు భారత్‌కు అవకాశం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈ ఏడాది బ్రిక్స్‌కు ఇండియానే నేతృత్వం వహిస్తున్నది. బ్రిక్స్ కూటమిలో రష్యా, చైనా కూడా ఉన్నాయి. ఆ రెండు దేశాలు ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ చమురు డిమాండ్‌లో ఈ రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో కీలక స్థానం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ తరఫున ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం, అత్యవసరంగా వర్చువల్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించాల్సింది. లేదా ఇరాన్, సౌదీ అరేబియా, అమెరికా మధ్య దౌత్య ప్రయత్నం చేయాల్సింది. కానీ ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. బ్రిక్స్ అధ్యక్ష స్థానాన్ని ఉపయోగించుకొంటూ యుద్ధంలో భాగస్వాములైన దేశాలు కాల్పుల విరమణ పాటించాలని చర్చలు జరపాల్సింది. హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు తగ్గించాల్సింది. కానీ మోదీ ప్రభుత్వం నిష్క్రియాపరంగా వ్యవహరించింది. ఇదే సమయంలో చైనా వేగంగా స్పందించి, ఇరాన్‌కు మద్దతు తెలిపింది. తన ప్రయోజనాలను కాపాడుకున్నది. కానీ మోదీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించింది.
భారతదేశ చారిత్రక విదేశాంగ వారసత్వం అలీన విధానం, వ్యూహాత్మక ప్రతిపత్తి. కానీ అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరించిన తీరు చూస్తుంటే ఆ చారిత్రక, వారసత్వ విధానాల నుంచి పక్కకు జరిగినట్టు కనిపిస్తున్నది. దురాక్రమణదారులతో చాలా సన్నిహితంగా ఉన్నట్టు కనిపించింది. బ్రిక్స్ అధ్యక్ష స్థానాన్ని ఉపయోగించి అంతర్జాతీయ వేదికలపై శాంతిని డిమాండ్ చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బయటదేశాల్లో ప్రాంతీయ సంఘర్షణపై సరిగ్గా స్పందించకుండా మన దేశ అస్తిత్వాన్నే సంక్షోభంలో పడేసిన ఘనత మోదీ సర్కారుది.
ప్రస్తుతం భారతదేశంలో చమురు, గ్యాస్ కొరత తీవ్రమైంది. చాలా రాష్ర్టాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కొవిడ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లు వంట గ్యాస్ కొరత కారణంగా మూతపడుతున్నాయి. కొన్ని హోటళ్లు సిబ్బందిని తొలగిస్తున్నాయి, మరికొన్ని పనివేళలు తగ్గిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లోని తినుబండారాల దుకాణాలు తాత్కాలికంగా మూసివేసినట్టు బోర్డులు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. మన దేశానికి అవసరమైన ముడి చమురులో 85 శాతం దిగుమతి ద్వారా లభిస్తుంది. ఆ దిగుమతి రవాణా కూడా గల్ఫ్ మార్గంతో ముడిపడి ఉన్నది. యుద్ధం వల్ల కొరత ఏర్పడటంతో సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా జోరుగా నడుస్తున్నది. ఎల్ఎన్జీతో నడిచే ఆటోలు, ట్యాక్సీల వ్యాపారం పతనావస్థకు చేరుకున్నది. రవాణా వ్యవస్థ దెబ్బతింటున్నది. మోదీ ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న ఇంధన భద్రత ప్రచారం హాస్యాస్పదంగా, అబద్ధంగా మారిపోయింది. ముందుజాగ్రత్తగా పెట్టుకున్న నిల్వలు కూడా కరిగిపోతున్నాయి. సంక్షోభ నివారణకు అనుసరించాల్సిన చర్యలపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపించడంలేదు.
అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు కలిసి సాగిస్తున్న యుద్ధంలో ఇరాన్ అధినేత అలీ ఖమేనీని హత్య చేయడం ఒక మలుపు. కనీసం అప్పుడైనా మోదీ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించాల్సింది. సంయమనం పాటించాలని పిలుపునివ్వాల్సింది. గతంలో గల్ఫ్ యుద్ధాలు జరిగినప్పుడు భారతదేశంలోని వివిధ ప్రభుత్వాలు సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు దోహదపడ్డాయి. కానీ యుద్ధం తీవ్రంగా రగులుకున్న దశలో కూడా అంతర్జాతీయ వేదికపై మోదీ ప్రభుత్వం కనిపించకుండానే పోయింది. బీజేపీ సర్కార్ నిష్క్రియాపరత్వం వల్ల అనేక రంగాలపై ప్రభావం కనిపిస్తున్నది. దిగుమతి బిల్లులు పెరగడంతో కరెంట్ అకౌంట్ లోటు పెరిగింది. అంతర్జాతీయంగా డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ పతనం, ద్రవ్యోల్బణ ఒత్తిడితో ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పని పరిస్థితికి నెట్టివేయవచ్చు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వ్యవహారం దౌత్యపరమైన తప్పిదమా? లేకపోతే ఒక ప్రధాన శక్తిగా ఉన్న భారత్ తన బాధ్యత నుంచి వెనుకడుగు వేసిందా? అనే విషయాలపై తీర్పును చరిత్ర చెప్తుంది.
-సుక్కన్న