Viral News : చాలామంది తమ వివాహాన్ని బంధుమిత్రుల నడుమ ఆడంబరంగా చేసుకోవాలని భావిస్తారు. కానీ ఛత్తీస్గఢ్ (Chattishgarh) కు చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. నిరాడంబరంగా తన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమంలో ఇతర జంటలతో కలిసి ఆయన పెళ్లి చేసుకున్నారు. ఎమ్మెల్యే పెళ్లి వార్త స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆదివారం బెమెతారా నియోజకవర్గం (Bemetara Constituency) లో ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహిక వివాహాలు జరిపించింది. అదే వేదికపై 20 కిపైగా జంటలతో కలిసి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత (BJP MLA) దీపేశ్ సాహు (Dipesh Sahu) పెళ్లి చేసుకున్నారు.
తరుణా సాహు అనే మహిళ మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. వివాహానికి ముందు వరుడిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అరుణ్ సావో స్థానిక సంప్రదాయం ప్రకారం ఎడ్లబండిలో ఊరేగిస్తూ తీసుకువచ్చారు. ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వివాహానికి వచ్చిన వారు ఎమ్మెల్యే దీపేశ్ సాహు నిరాడంబరతను ప్రశంసించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బెమెతారా జిల్లాలో రూ.105 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రకటించారు.