కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనాలు, ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. హైడ్రా తీరును తప్పుబడుతూ హైకోర్టు స్పందించి కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని తీర్పు ఇవ్వడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
అమీన్పూర్ (జిన్నారం), జూలై 28 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్ సర్కిల్ పరిధిలోని ఆయా గ్రామాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. రెండేండ్ల క్రితం కిష్టారెడ్డిపేటలోని మూడు బహుళ అంతస్థుల భవనాలు, పటేల్‌గూడ గ్రామ పరిధిలోని (2024 సెప్టెంబర్ 22న) బీఎస్ఆర్కాలనీలో 22 ఇండిపెండెంట్ ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చివేయించారు. బ్యాంకులోన్ తీసుకొని ఇండ్లు కొన్నామని ఎంత ప్రాధేయ పడినా, ఇండ్లు లేకపోతే రోడ్డుపై పడతామని, తమ చిన్నారుల భవిష్యత్ ఆగమవుతుందని ఎంత ఏడ్చినా అధికారులు స్పందించలేదు.
రెండు రోజులు బుల్డోజర్లు, జేసీబీలతో ఇండ్లను కూల్చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 12న ఐలాపూర్ పరిధిలోని ఆరంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేయించారు. ఈ భవనంలో నివాసం ఉంటున్న సుమారు నలభై కుటుంబాలకు ఎలాంటి సమచారం ఇవ్వకుండా, నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేయించేందుకు సిద్ధమయ్యారు. తెల్లవారు జామున ఇండ్లలోకి వెళ్లి ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో భవనంలో ఉన్న ప్రజలు ఖంగుతిన్నారు. ఉన్న ఫలంగా ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. విదేశాల్లో ఉన్న వారి ఇండ్ల తాళాలు పగులకొట్టి వస్తువులను ఖాళీ చేయించారు.
వారం రోజులు బుల్డోజర్, జేసీబీలతో ఆరంతస్థుల భవనాన్ని కూల్చివేయించారు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐలాపూర్తండాలోని 14 నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేసేలా చర్యలు తీసుకున్నారు. కోర్టు పరిధిలో తమ భూములు ఉన్నాయని, కోర్టు ఆదేశాలు చూపినా అధికారులు పట్టించుకోలేదు. వందల సంఖ్యలో పోలీసులను మొహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హైడ్రా మొండిగా వ్యవహరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును వ్యతిరేకిస్తూ హైకోర్టు ఆయన్ను విధుల నుంచి తప్పించాలని ఆదేశించడంతో ప్రజలు, బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఉసురు తగిలిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.అమీన్‌పూర్‌లోని పెద్దచెరువు ముంపు బాధితులకు న్యాయం చేస్తామని కమిషనర్ రంగనాథ్ తమకు మాట ఇచ్చి విస్మరించారన్నారు.

పేదల ఉసురు తాకింది
మేడిపల్లి,జూలై 28: హైడ్రాపై కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హైడ్రా కమిషనర్‌ను తక్షణమే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. హైడ్రాను అడ్డు పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను బాక్ల్ మెయిల్ చేశారన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి పేద ప్రజలకు అండగా ఉందన్నారు. హైడ్రా కమిషనర్ రాత్రికి రాత్రే పేదల ఇండ్లను కూల్చి రోడ్డు పాల్జేశారని, అటు ప్రభుత్వానికి ఇటు, రంగనాథ్ కు పేద ప్రజల ఉసురు తాకిందన్నారు. నియంతలా వ్యవహరించిన రంగనాథ్‌కు తగిన శాస్త్రి జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధితో వ్యవహరించాలన్నారు.
కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోలేదు
బీఆర్ఎస్ కార్యాలయం అని తెలిసే కావాలని అధికారులు భవనాన్ని కూల్చివేయించారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు. హైడ్రా అధికారులు చాలా మొండిగా వ్యవహరించారు. హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు తప్పించడం ప్రభుత్వ వైఫల్యమే. సామాన్య, నిరుపేదలపై హైడ్రా పేరుతో ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. తక్షణమే హైడ్రాను పూర్తి స్థాయిలో తప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారు.
-మాణిక్‌యాదవ్, బీఆర్ఎస్ నేత, ఐలాపూర్(సంగారెడ్డి జిల్లా)
ఇంటిని కూల్చివేశారు
ఇరవై ఏండ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నాం. గ్రామ పంచాయతీ అనుమతులు, కరెంట్ బిల్లులు కూడా చూపించినా పట్టించుకోలేదు. ఉన్న ఫలంగా హైడ్రా అధికారులు తాము నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేశారు. రంగనాథ్‌ను హైడ్రా నుంచి కాకుండా శాశ్వతంగా విధుల నుంచి తొలిగించేలా కోర్టు తీర్పు ఇవ్వాలి అప్పుడే మాకు సంతోషం.
– సిద్దు, బాధితుడు, ఐలాపూర్ (సంగారెడ్డి జిల్లా)
గృహ ప్రవేశం ఐన ఐదు రోజులకే కూల్చివేశారు
రూ.1.20కోట్లు ఖర్చుపెట్టి ఇంటిని కొనుగోలు చేశాం. గృహ ప్రవేశం చేసిన ఐదు రోజులకే అధికారులు ఇంటిని కూల్చివేయించారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇంటిని కూల్చివేసే విషయమై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇంటిని కూల్చివేసిన విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథను చాలాసార్లు నేరుగా ప్రశ్నించినా ఆయన వద్ద సమాధానం లేదు. కోర్టు అదేశాలను సైతం లెక్కచేయకుండా ఇంటిని కూల్చివేశారు. హైడ్రా కమిషనర్‌ను తొలిగించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి.
– సత్యనారాయణ, బాధితుడు, బీఎస్ఆర్కాలనీ, అమీన్‌ఫూర్, (సంగారెడ్డి జిల్లా)