చారిత్రక ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపపోరు నగర రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నది. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన మహానగరం ఇప్పుడు అనివార్యమైన ఈ ఉపపోరునకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో అప్పుడే ముసలం మొదలైంది. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఈదఫా తనదే టికెట్ అనే ధీమాలో ఉన్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే అనుచరులకు సంకేతాలివ్వడంతో క్షేత్రస్థాయిలో వారంతా హడావిడి మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది.
ఇదే సమయంలో ఇటీవల పార్టీ ఫిరాయింపు వేటుపడి పదవిని కోల్పోయిన దానం నాగేందర్ మాత్రం ధీమాగా తనకే టికెట్ అని చెప్పుకునే పరిస్థితి లేకపోవడం ఆయన అనుచరుల్ని అయోమయానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా ఉపపోరు బరిలో నిలువకుంటే ప్రత్యక్ష రాజకీయాలే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉండగా… పోరులో నిలిస్తే కీలకమైన విజయారెడ్డి వర్గం సహకరించేలా లేకపోవడంతో దానం పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైందని ఆయన అనుచరులే వాపోతున్నారు. కాగా ఖైరతాబాద్ కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ అన్నట్లుగా దశాబ్దాల అనుబంధం కొనసాగిన దరిమిలా ఈ ఉప పోరు టికెట్ ఎంపికలో కాంగ్రెస్ ఆయన కుటుంబానికి ఏమేరకు న్యాయం చేస్తుందనేది కూడా మరో కీలక అంశమని పరిశీలకులు భావిస్తున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉప పోరు అనేదే హాట్‌టాపిక్‌గా మారింది. దానం నాగేందర్‌పై అధికారికంగా వేటు పడిన తర్వాత అన్ని ప్రధాన పార్టీలు ఖైరతాబాద్ ఉపపోరుపై అంతర్గతంగా దృష్టిసారించాయి. ఈ క్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్‌లో అప్పుడే చాపకింద నీరులా ముసలం మొదలైంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కేవలం మూడు నెలల్లోనే గోడ దూకి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ రాకను ఆది నుంచి నియోజకవర్గంలోని విజయారెడ్డివర్గం వ్యతిరేకిస్తున్నది. పైగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తన కుటుంబంతో అనుబంధం ఉన్న నియోజకవర్గంలోనే పార్టీని నమ్ముకొని ఉన్నారు. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ అభ్యర్థి కోసమంటూ ‘ముఖ్య’నేత నాగేందర్‌ను పార్టీలోకి తీసుకువచ్చారు.
ఆ తర్వాత గత రెండున్నర సంవత్సరాలుగా దానం, విజయారెడ్డి వర్గాలు నిత్యం ఎడమొహం పెడమొహంగానే ఉన్నా యి. ఈ రెండు వర్గాల మధ్య ఎంత అంతరం ఉందంటే… నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ముందు దానం నాగేందర్ కొబ్బరి కాయ కొట్టి వెళ్లిపోయిన గంటలోపే విజయారెడ్డి తన వర్గంతో వచ్చి మళ్లీ కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా రెండున్నర సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో రెండు వర్గాలు సమాంతరంగా… పోటాపోటీగా పార్టీ, అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఉప పోరులో కాంగ్రెస్ టికెట్ కోసం రెండువర్గాలు గట్టిగా పట్టుబడుతున్నందున ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా రెండో వర్గం కచ్చితంగా సహాయ నిరాకరణ చేస్తుందని కాంగ్రెస్వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.
‘ముఖ్య’నేతను నమ్ముకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ చివరి నిమిషం దాకా వేటు పడకుండా నానా ప్రయత్నాలు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినా పదవిని కాపాడుకోలేకపోయారు. దీంతో తన భవిష్యత్ ఎలా ఉంటుందనే భయం దానంను వెంటాడుతుందని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ‘ముఖ్య’నేతను నమ్ముకొని వస్తే… లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఆపై ఆ ఊసే ఎత్తకపోయిన విషయాన్ని అనుచరులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు గత రెండున్నర సంవత్సరాలుగా కిందిస్థాయి అధికారులు సైతం దానం మాటను ఖాతరు చేయకపోవడం, ఆయన పదేపదే ఆ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించి ఆవేదన చెందిన వైనాన్ని అనుచరులు గుర్తు చేసుకొని మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దానం టికెట్‌పై అంతర్మథనం చెందుతుండగా… మరోవైపు విజయారెడ్డి మాత్రం తనకే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు.
పీజేఆర్‌తో కాంగ్రెస్ అనుబంధమే కాకుండా పార్టీని నమ్ముకొని 2023 ఎన్నికల్లో పోటీ చేశారని, ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గాన్ని, పార్టీని నమ్ముకొని ఉన్నారనే అంశాలను ప్రస్తావిస్తున్నారు. పార్టీలు మారే వాళ్లకు అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే పార్టీని పట్టుకొని ఉన్న వారి సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ ఉప పోరులో టికెట్ ఖరారు అనేది కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా తయారైందనేది అర్థమవుతుంది. పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి కూడా తండ్రి బాటలోనే ఎన్నో ఏండ్లు కాంగ్రెస్‌కు సేవలందించారు. కానీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మారాయి. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్‌పై జరిగిన రేసులో ‘ముఖ్య’నేత పట్టుబట్టి అజారుద్దిన్‌కు ఇప్పించారని, విష్ణువర్దన్‌రెడ్డికి తీవ్ర అన్యాయం చేశారనేది బహిరంగ రహస్యం. అందుకే విష్ణు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప పోరు లో కాంగ్రెస్ పీజేఆర్ కుటుంబంలోని విజయారెడ్డికి అవకాశం ఇస్తుందా? దానంను బరిలోకి దింపుతుందా? ఈ రేసులో ‘ముఖ్య’నేత ఎలా చక్రం తిప్పుతారనేది ఆసక్తిగా మారింది.