మేడ్చల్ జిల్లా గాజులరామారంలో విలువైన ప్రభుత్వ భూమిపై ఒక కాషాయ నేత కన్ను పడింది..రూ. కోట్ల విలువ చేసే సర్కారీ స్థలాన్ని ఏకంగా తన కూతురికి గిఫ్ట్ డీడ్ రూపంలో రాసిచ్చేసి దర్జాగా కబ్జా పర్వానికి తెరలేపారు. రెవెన్యూ రికార్డుల్లో లేని ‘ బై నంబర్లు’ సృష్టించి అధికారుల కళ్లు గప్పి నిర్మాణాలు చేపడుతున్న తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చేసి రూ. కోట్ల ఆస్తిని సొంతం చేసుకునేందుకు వేసిన ఈ స్కెచ్‌పై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
దుండిగల్, జూలై28 : రెవెన్యూ అధికారులు మాత్రం తీరిగ్గా మేల్కొని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై వెంటనే ఎవిక్షన్ నోటీసులు (ఆక్రమణల తొలగింపు నోటీసులు) జారీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు రెవెన్యూ యంత్రాంగం త్వరితగతిన బుల్డోజర్లతో రంగంలోకి దిగుతుందో లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతుందో వేచి చూడాల్సిందే. కుత్బుల్లాపూర్ మండలం,గాజులరామారంలోని సర్వేనంబర్ 329/6,మహదేవపురం అన్నపూర్ణేశ్వరీ మాత దేవాలయం వెనుకాల ఉన్న విలువైన ప్రభుత్వభూమిలో ఓ కాషాయనేత గడిచిన రెండు నెలలుగా బహుళ అంతస్తుల భవనం దర్జాగా నిర్మిస్తున్నాడు.
ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో కోట్లాది రూపాయలు విలువ ఉంటుందని స్థానికులు అంటున్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ ఆక్రమణపై రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సదరు నేత తనకున్న పలుకుబడితో సర్వేనంబర్ 329/6తో పాటు మరికొన్ని ప్రైవేట్ నంబర్లను జతచేర్చి నిర్మాణ అనుమతులు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది.అయితే ప్రభుత్వభూమిని పరిశీలించకుండానే మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనే చర్చ జరుగుతుంది.
మరో వైపు రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే తనకున్న రాజకీయపలుకుడిని ఉపయోగించిన సదరు నేత అధికారులను మేనేజ్ చేయడంతో పాటు ప్రభుత్వభూమికి బై నంబర్లు సృష్టించి నిర్మాణపరమైన అనుమతులు తెచ్చుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పైగా ఈ భూమి వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని స్థానికులు చెబుతుండడం విశేషం. అంతేకాకుండా గతంలో ఇదే స్థలంలో రేకుల రూంలను కట్టేందుకు ఆక్రమణదారులు యత్నించిగా అప్పట్లో అధికారులు సదరు గదులను నేలమట్టం చేశారని పేర్కొంటున్నారు.అయితే ప్రస్తుతం ప్రభుత్వభూమిలో జరుగుతున్న నిర్మాణాలకు అటుమున్సిపాలిటీ,ఇటు రెవెన్యూ విభాగాలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సదరు నేత మాత్రం తాను ఆ భూములను వేరే వ్యక్తుల నుంచి కొనుగోలు చేశానని,తనది సెకండ్ డాక్యుమెంట్ అని చెబుతున్నట్లు సమాచారం.
యూఎల్సీ ల్యాండ్‌లోనూ ఆక్రమణలు..
ఇదిలా ఉండగా సర్వేనంబర్ 329/6,గాజులరామారంలోని యూఎల్సీ భూములను కొందరు వ్యక్తులు కొంత కాలంగా మట్టితో నింపి చదును చేస్తున్నారు.కొందరైతే రాత్రికి,రాత్రే గదులను నిర్మించి మనుషులను దింపుతున్నట్లు తెలుస్తుంది.అదే సమయంలో మరికొందరు యూఎల్సీ భూములను మట్టితో నింపి చదును చేస్తున్నట్లు సమాచారం.
ఎవిక్షన్ నోటీసులు ఇస్తాం: తహసీల్దార్
తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్‌ను వివరణ కోరగా గాజులరామారంలోని సర్వేనంబర్ 329/6, ప్రభుత్వభూమిలో బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.అయితే నిర్మాణదారుడి పేరిట మున్సిపల్ అధికారులు సర్వేనంబర్ 329/1 ప్రభుత్వభూమితో పాటు మరి కొన్ని సర్వేనంబర్లను కలిపి భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని,దీంతో నిర్మాణదారుడికి ‘ఎవిక్షన్ నోటీసులు’ జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తదనంతరం కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.