యాదాద్రి భువనగిరి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం తీసుకొచ్చిన చేనేత భరోసా పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ఈ స్కీం మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. నాలుగు విడతల్లో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే నిధులు జమ చేసి చేతులు దులుపుకున్నారు. ఆగస్టుతో మూడు విడతల సాయం బకాయి పడింది. నేత కార్మికులు సర్కారు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
అమలులో జాప్యం చేస్తున్న కాంగ్రెస్
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో తీసుకొచ్చిన పలు పథకాలను కాంగ్రెస్ నిలిపేసింది. ఆ తర్వాత కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో గతే డాది చేనేత దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సర్కారు చేనేతకు భరోసా పేరుతో అట్టహాసంగా పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఏటా రూ. 30 వేల సాయం అందగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ. 24 వేలు మాత్రమే ప్రకటించింది. ఇందులో భాగంగా నేతన్నకు రూ. 18వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేల ఇవ్వాలని నిర్ణయించింది. నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రోత్సాహకం జమ చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 18 ఏండ్లు నిండిన నేత, అనుబంధ కార్మికులకు ఈ పథకం వర్తింపజేస్తామని పేర్కొంది. జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై నేసిన వారే అర్హులు. అయితే ఎప్పటి నుంచో అమలు చేస్తామని గప్పాలు కొట్టినా.. వివిధ రకాల సాకులు చూపుతూ అమలులో జాప్యం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
రూ.10 కోట్ల మేర బకాయిలు..
చేనేత భరోసా పథకంలో భాగంగా వార్పులో కనీసం 50 శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన వారికి సాయం అందుతుంది. ఏడాదికి నాలుగు విడతల్లో డబ్బులు జమ చేయాలి. ఒక ఫేజ్లో నేతన్నకు రూ.4500, అనుబంధ కార్మికుడికి రూ.1500 ఇస్తారు. కానీ ఇప్పటి వరకు కేవలం ఒక దశ డబ్బులు మాత్రమే డిపాజిట్ చేశారు. ఇంకా మూడు దఫాలు నేతన్నల సాయం పెండింగ్లోనే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 10,646 మంది కార్మికులు సాయం అందాల్సి ఉంది. ఒక విడతకు రూ. రూ.3.29 కోట్లు అవసరం కాగా, దాదాపు మూడు విడతలకు కలిపి రూ. 10 కోట్ల మేర సర్కారు బకాయి పడింది.
కేసీఆర్ పథకానికి తూట్లు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేనేత మిత్ర పథకం తీసుకొచ్చారు. కార్మికులకు రసాయనాలు, నూలుపై 40 శాతం రాయితీ కల్పించారు. కొందరికి అవగాహన లేకపోవడం, సబ్సిడీ పొందే ప్రక్రియ తెలియకపోవడంతో దాన్ని పొందలేకపోయారు. దీని స్థానంలో మగ్గంపై పనిచేసే ప్రతి కార్మికుడికి నెలకు రూ.3వేల సాయం అందించాలని నిర్ణయించారు. కార్మికుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశారు. రూ. 3వేల సాయంలో నేత కార్మికుడికి 2వేలు, అనుబంధ కార్మికుడికి వెయ్యి డిపాజిట్ చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఒక్క పైసా వేయలేదు. కేసీఆర్ పథకానికి తూట్లు పొడుస్తూ పథకాన్నే నిలిపేశారు.
ఒక విడతతోనే సరిపెట్టారు..
చేనేత భరోసా పథకం కింద నేత కార్మికులకు అందించే సాయం రావడంలేదు. మూడు నెలల క్రితం ఒక్కసారి మాత్రమే డబ్బులు వేశారు. నేతన్నకు రూ.4500, అనుబంధ కార్మికులకు రూ. 1500 వేశారు. మళ్లీ ఇప్పటి వరకు పత్తాలేదు. ఎప్పుడు వేస్తోరో అని ఆశగా ఎదురుచూస్తున్నాం. రైతుల మాదిరిగానే నేతన్నలకు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయాలి.
-గుండు ప్రవీణ్, చేనేత కార్మికుడు, భూదాన్ పోచంపల్లి