సిటీ బ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : గృహ నిర్మాణ సంస్థ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు కేటాయించిన బ్లాక్‌లను కూల్చి కామన్ ఏరియా స్థలాలను కలుపుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. బ్లాక్ స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకుండా అనుమతులు ఇస్తున్నారు.
హౌసింగ్ బోర్డు బ్లాక్‌ల స్థానంలో కొత్త నిర్మాణాలను చేపడుతున్నారు. ఎన్వోసీ తీసుకోకున్న జీహెచ్ఎంసీ ఇష్టానుసారం అనుమతులు మంజూరు చేస్తున్నది. హౌసింగ్ బోర్డు స్థలాలను ఆక్రమించి, ఎన్వోసీ తీసుకోకుండా ఇండ్లు నిర్మిస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నదని స్థానికులు మండిపడుతున్నారు.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) ఉమ్మడి ఏపీలో నాలుగైదు దశాబ్దాల క్రితం నగరంలో హౌసింగ్ బోర్డు జీ ప్లస్ వన్ తరహాలో బ్లాక్‌లను నిర్మించింది. ఒక్కో బ్లాక్‌లో నాలుగు ఇండ్లను నిర్మించి నాలుగు కుటుంబాలకు కేటాయించింది. ఆయా బ్లాక్‌లకు చుట్టూ 150 నుంచి 200 గజాల కామన్ ఏరియా ఉంటుంది. హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం ఆయా బ్లాక్‌లలోని గదులు మాత్రమే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ అవుతాయి. చుట్టూ ఉన్న కామన్ ఏరియా హౌసింగ్ బోర్డు పరిధిలోనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ బ్లాక్‌లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని కూల్చి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. చుట్టూ ఉన్న కామన్ ఏరియాను కూడా కలుపుకొని నిర్మిస్తున్నారు.
హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం కామన్ ఏరియాలో నిర్మాణం చేపట్టాలంటే ప్రస్తుత మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కొనుగోలు చేసినట్లు హౌసింగ్ బోర్డు నుంచి ఎన్వోసీ ఉంటేనే జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటిదేమీ జరగకుండానే కామన్ ఏరియాను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అటు జీహెచ్ఎంసీ అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులు మాత్రం వేడుక చూస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా రూ.కోట్ల విలువైన హౌసింగ్ బోర్డు స్థలం అన్యాక్రాంతం అవుతున్నది. ముఖ్యంగా ఎస్ఆర్నగర్, బాగ్ లింగంపల్లిలో ఈ తరహా నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎక్కడా హౌసింగ్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఎస్ఆర్ నగర్లో హౌసింగ్ బోర్డు కేటాయించిన బ్లాక్‌లను కూల్చి, కామన్ ఏరియాను కబ్జా చేసి నూతన నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. బాపునగర్ను ఆనుకుని ఉన్న ఎస్ఆర్నగర్లో బీ4 బ్లాక్‌లు ఉన్నాయి. ఆ ప్రాంతంలో రెండేండ్ల కిందట హౌసింగ్ బోర్డు బ్లాక్‌ను కూల్చి దాదాపు 160 గజాల కామన్ ఏరియాను కబ్జా చేసి ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో గజం ధర రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా పలుకుతున్నది. 160 గజాలకు రూ.2 కోట్ల దాకా హౌసింగ్ బోర్డు స్థలాన్ని కలుపుకొన్నారు.
దానికి జీహెచ్ఎంసీ 7-1-621, బీ4/ఎఫ్3 ఇంటి పేరుతో ఎలాంటి తనిఖీలు చేయకుండా అనుమతులు ఇచ్చింది. తాజాగా దాని పక్కనే మరో బ్లాక్ స్థానంలో ఇంకో నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు అది పిల్లర్ల దశలో ఉంది. దీని యజమాని కూడా హౌసింగ్ బోర్డు పరిధిలోని 160 గజాల కామన్ ఏరియాను కబ్జా చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. ఇదంతా హౌసింగ్ బోర్డు అధికారులకు తెలిసే జరుగుతున్నట్లు, తమలాగా చాలా మంది నిర్మిస్తున్నట్లు యజమానులే బహిరంగంగా చెబుతున్నారు. కామన్ ఏరియాలో నిర్మాణం చేసేందుకు హౌసింగ్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అంటున్నారు. అధికారులు మొద్దు నిద్ర వీడకపోవడంతో మరిన్ని హౌసింగ్ బోర్డు స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి.