హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలను అబద్ధాలకు వేదికగా మార్చి బీఆర్ఎస్పై బురదజల్లి విలువైన సమయాన్ని రేవంత్ సర్కార్ వృథా చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో ఆత్మస్తుతి.. పరనింద తప్పా ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. సభను ప్రజాస్వామ్యయుతంగా నడిపామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారనే భయంతో బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిందని మండిపడ్డారు.
అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్ దుశ్శాసన పర్వం సాగించి నడిరోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని నిప్పులు చెరిగారు. రూ. 200 కోట్ల విలువైన భూమిని తన తమ్ముడి కంపెనీ టెస్సెరాక్ట్కు కట్టబెట్టిన వ్యవహారంపై దృష్టిమరల్చేందుకే కేసీఆర్ కుటుం బంపై పనికిమాలిన ఆరోపణలు చేసిందని విమర్శించారు. అసెంబ్లీ లోపల, వెలుపల అధికార కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించి ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చిందని మండిపడ్డారు. 483 పేజీలున్న క్యూర్ బిల్లుపై సమగ్ర చర్చలేకుండానే మండలిలో అరగంట, శాసనసభలో గంటలోగా ఆమోదించుకోవడం సర్కారు నిరంకుశ వైఖరికి అద్ధంపడుతున్నదని దుమ్మెత్తిపోశారు.
మూడేండ్ల పాలనలో 420 హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగానే బ్లాక్ టీషర్టులు ధరించి అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులమంతా వెళ్లినట్టు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. డ్రెస్‌కోడ్‌ను సాకుగా చూపి అసెంబ్లీ గేటు వద్దకు రాకుండా బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్‌కు బ్లాక్ టీషర్ట్‌తో రాహుల్ వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి పెయిడ్ బ్యాచ్‌లా మారి ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ గొంతునొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంపై చావు డప్పు పేరిట దాడులకు తెగబడ్డ కాంగ్రెస్ గూండాలకు పోలీసులు రోప్ పార్టీతో రక్షణ కల్పించారని దుయ్యబట్టారు.
కేసీఆర్ వద్దకు వెళ్తున్న తమ నాయకులను అడ్డుకోవడం కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యానికి అద్దంపడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎదుట ‘మహిళా ప్రజాప్రతినిధులపై దౌర్జన్యాలకు పాల్పడ్డ పోలీసులపై చర్యలేదుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయం కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షాన్ని సభ నుంచి గెంటేసి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయి అసెంబ్లీని నడిపించుకున్నాయని ఆరోపించారు. హామీల అమలుపై నిలదీస్తారనే భయంతోనే బీఆర్ఎస్ గొంతునొక్కారని ఆరోపించారు. 22-ఏ నుంచి ఆస్తులు తొలగించేందుకు కాంగ్రెస్ నేతలు 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నదని పదే పదే దుష్ప్రచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాత్రం 67 ఎకరాలేనని చెప్పారని ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. గతంలో అబద్ధం చెప్పినందుకు కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఉన్న వ్యవసాయ భూమిలో ఒక్క గుంటా దళితుల భూమిలేదని స్పష్టంచేశారు. కానీ రేవంత్‌రెడ్డి ఆయన నివాసంపై దళితుల ముసుగులో కాంగ్రెస్ గూండాలను పంపి రాక్షసానందం పొందారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ 300 ఎకరాలు కబ్జా చేశారని నిరూపిస్తే రాజీనామా కు బీఆర్ఎస్ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారని, తప్పని తేలితే రేవంత్‌రెడ్డి, మంత్రులు రాజీనామా చేస్తారా?’ అని సవాల్ విసిరారు.
కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తప్పు ఒప్పుకొని లెంపలేసుకోవాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి చేసిన పిచ్చి ప్రేలాపనలను సాకుగా చూపు తూ కొన్ని సర్కార్ అనుకూల పత్రికలు కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల ఆస్తులున్నాయని ప్రచా రం చేయడం బాధాకరమని మండిపడ్డారు. ‘లక్ష కోట్లలో ఒక్క శాతం మాకు ఇచ్చి మిగిలిన 99 శాతం ఆస్తులు ప్రభుత్వం తీసుకొని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి..’అని కేటీఆర్ ఇచ్చిన అఫర్‌కు రేవంత్‌రెడ్డి సిద్ధమా? అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల భూము ల వద్దకు వెళ్లడానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏం హక్కు ఉన్నదని ప్రశ్నించారు.
కేసీఆర్ పూర్తిచేసిన పనులకు రిబ్బన్ కటింబ్బన్రెడ్డిగా పిలుస్తున్నారని దెప్పిపొడిచారు. సీఎం తమ్ముడికి రూ. 200 కోట్ల విలువైన ఏడెకరాల భూమిని కట్టబెట్టిన వ్యవహారాన్ని బట్టబయలు చేసినందుకే బీఆర్ఎస్పై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిని పోలీస్‌స్టేషన్‌లోనే కాంగ్రెస్ మూకలతో దాడులు చేయించడం..బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి తాళాలు పగలగొట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దానం నాగేందర్‌పై వేటు వేసినట్టుగానే పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.