హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓవైపు ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంటే మరోవైపు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం జెన్కో ప్లాంట్లల్లో 6.05 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కార్పెట్ లెవల్ బొగ్గును తీసేస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును మాత్రమే విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించేందుకు వీలవుతుంది. జెన్కో రోజుకు సగటున 74,800 మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తున్నది.
రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు కలిపి రోజుకు 74,800 మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా.. సింగరేణి నుంచి 88,806 మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే అందుతున్నది. అంటే రోజువారీ వినియోగం కంటే కేవలం 14 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే అదనంగా వస్తున్నది. దీంతో థర్మల్ విద్యుత్తు పాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనల ప్రకారం ప్రతి ప్లాంట్‌లో 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు పాంట్లలో ఉన్న నిల్వలు నాలుగైదు రోజులకు మించి సరిపోయే పరిస్థితి లేదు.
రాష్ట్రంలోనే అతిపెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు రోజుకు 27 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. కానీ, ఈ ప్లాంట్‌కు సింగరేణి నుంచి రోజువారీగా సరఫరా అవుతున్న బొగ్గు 22,888 మెట్రిక్ టన్నులు మాత్రమే. రెండ్రోజుల క్రితం వైటీపీఎస్‌లో 1,37,116 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో కార్పెట్ లెవెల్ కోల్‌ను తీసేస్తే మిగిలిన నిల్వలు 3-4 రోజులకు మాత్రమే సరిపోతాయి. దీంతో ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గును తెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్లాక్ నుంచి రోజుకు ఒక రైల్వే రేకు ద్వారా 2,100 టన్నుల బొగ్గు రవాణా అవుతున్నది. దీనిని దశలవారీగా 10-14 వేల టన్నులకు పెంచేందుకు సింగరేణి ప్రయత్నిస్తున్నది.
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లోని రెండు యూనిట్లలో రోజూ 13 వేల టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కేటీపీపీలో 70,431 మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే ఉన్నది. ఇది 3 రోజులకు మించి చాలదు. వాస్తవానికి రాష్ట్రంలో అంతో ఇంతో సమర్థంగా నడిచే ప్లాంట్ ఇదొక్కటే. తాడిచెర్ల కోల్‌బ్లాక్ జెన్కో ఆధ్వర్యంలోనే ఉన్నప్పటికీ కేటీపీపీలో బొగ్గు సమస్య ఉత్పన్నమవుతున్నది. ఇదేవిధంగా 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో 90,535 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నది. రోజుకు 13,200 మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగిస్తున్న బీటీపీఎస్‌లో ప్రస్తుతమున్న నిల్వ 5-6 రోజులకు మాత్రమే సరిపోతుంది.
తెలంగాణలో బొగ్గు గనులు విస్తారంగా ఉన్న కొత్తగూడెం నుంచి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు బొగ్గు సరఫరా అవుతుంటుంది. అయినప్పటికీ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) 5, 6, 7 ప్లాంట్లల్లో ప్రస్తుతం 1,83,588 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో కార్పెట్ లెవెల్ కోల్‌ను తీసేస్తే మిగిలిన నిల్వలు 10-11 రోజులకు మాత్రమే సరిపోతాయని జెన్కో ఇంజినీర్లు చెప్తున్నారు.
రాష్ట్రలో జలాశయాలు అడుగంటడంతో హైడల్ విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను నడుపాల్సి వస్తున్నది. కానీ, వీటిలో బొగ్గు నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే థర్మల్ ప్లాంట్లను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తిని కొనసాగించాలంటే బొగ్గు సరఫరాలను పెంచాలని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే రోజుకు 10-12 గంటల కరెంట్ కోతలు ఖాయమని హెచ్చరిస్తున్నారు.