న్యూఢిల్లీ: ఆలిండియా సీనియర్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి అజిత్ అగార్కర్ దిగిపోతున్నాడు. అక్టోబర్ 4వ తేదీతో ముగియనున్న తన కాంట్రాక్ట్ పొడిగింపును కోరకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అజిత్ ఇప్పటికే బోర్డుకు స్పష్టం చేయడంతో వారు కొత్త చీఫ్ సెలెక్టర్‌ను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. 2023 జూలైలో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో భారత జట్టు రెండు ఆసియా కప్‌లు (2023, 25), రెండు టీ20 ప్రపంచకప్‌లు (2024, 26), గతేడాది చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.
ఓ చీఫ్ సెలెక్టర్‌గా తనకిది గొప్ప ఘనతే. కానీ కొన్నాళ్లుగా అగార్కర్ తీరుపై బోర్డు ఆగ్రహంగా ఉంది. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బోర్డుతో అతనికి అభిప్రాయ భేదాలు వచ్చాయి.సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఆటగాళ్ల ఎంపిక, పనిభార నిర్వహణపైనా విభేదాలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌ను పక్కనబెట్టి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని అగార్కర్ భావించాడు. కానీ, అతనితో మాట్లాడకుండానే బీసీసీఐ సెక్రటరీ సైకియా రోహిత్‌కు మద్దతుగా మీడియాకు ప్రకటన విడుదల చేశాడు. దీనికితోడు ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో ఓటమిపై ముంబైలో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడంతో బోర్డుతో అతని బంధం పూర్తిగా తెగిపోయినట్టంది.