Indian : కువైట్‌లోని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై మంగళవారం ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తీవ్ర సానుభూతి ప్రకటించింది. మృతుడి కుటుంబాన్ని సంప్రదించామని, అతడి కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని ఎంబసీ ప్రకటించింది. ఈ విషయంలో కువైట్ అధికారులతో కూడా సంప్రదిస్తున్నామని తెలిపింది.
ఈ దాడి ఘటనలో గాయపడ్డ ఇతర భారతీయులకు కూడా అవసరమైన వైద్య సాయం అందిస్తామని, బాధిత కుటుంబాల్ని సంప్రదిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కువైట్‌లోని భారత ఎంబసీ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో 63 మంది గాయపడ్డారని కువైట్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఎయిర్‌పోర్టు సిబ్బందితోపాటు ప్రయాణికులు కూడా ఉన్నారని వెల్లడించింది. బాధితుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్టు వద్ద 25కుపైగా అంబులెన్స్‌లు సేవల్లో పాల్గొంటున్నాయని కువైట్ అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తోంది.
ఒక పక్క చర్చలు నడుస్తున్నాయని ప్రకటిస్తున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇరాన్‌లోని గెరుక్, ఖేష్మ్ ద్వీపాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీంతో బదులుగా ఇరాన్ కూడా బహ్రెయిన్, కువైట్‌లోని స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు అక్కడి జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. విమానాశ్రయం దెబ్బతినడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఈ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన అనేక విమానాల్ని ఇతర ప్రాంతాలకు మళ్లించారు.