అబిడ్స్, ఆగస్టు 1 : మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ మళ్లీ ప్రారంభమైంది. శనివారం మొదటి రోజు రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు క్యూ కట్టి బియ్యాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్‌నిలో ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మాసంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ఒకేసారి అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాటి నుంచి పంపిణీని ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలోని 843607 ఆహార భద్రత కార్డులు ఉండగా కార్డుదారులకు 59,602,822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279,513 మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలను కేటాయించారు. రేషన్ బియ్యాన్ని కార్డులోని ప్రతి సభ్యునికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోల బియ్యాన్ని కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి సరఫరా చేయాలని నిర్ణయించారు.
గోధుమలు కిలో ఏడు రూపాయల చొప్పున జిల్లాలోని 653 చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీని శనివారం ప్రారంభించారు. ఆగస్టు 31వ తేదీ వరకు సరుకులను సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రేషన్ కార్డులలో ప్రతి కార్డుదారుని నుంచి మూడు సార్లు వేలి ముద్రలు తీసుకుని మూడు సార్లు తూకం చేయాల్సి వస్తుండడంతో దుకాణాల వద్ద క్యూ కట్టారు. మొదటి రోజు కావడంతో కార్డుదారులు దుకాణాలకు రాగా ఒక కార్డుదారునికి దాదాపు పది నిమిషాల సమయం పడుతుండడంతో ఇబ్బంది పడ్డారు. మొదటి రోజు ఉదయం దాదాపు నలభై మంది, సాయంత్రం నలభై మంది వరకు మాత్రమే బియ్యం అందించామని చౌకధరల దుకాణ దారులు ఆవేదన వ్యక్తం చేశారు.
రేషన్ దుకాణాలలో మూడు నెలల బియ్యం పంపిణీని ప్రారంభించడంతో ఒక కార్డుదారునికి మూడు సార్లు తూకం చేయాల్సి రావడంతో గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జూన్ మాసం, ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో మూడు నెలల రేషన్ సరఫరా చేసిన విషయం విదితమే. రెండు సార్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నెల బియ్యం పంపిణీలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కార్డుదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నతాధికారులను కలిసి మూడు నెలల సరుకుల పంపిణీ వద్దని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. బియ్యం పంపిణీని సాఫీగా చేసేందుకు వీలుగా వేయింగ్ మిషన్‌కు బ్లూ టూత్ కనెక్షన్, గోడౌన్లలో డీలర్లు వేలిముద్రలు వేస్తేనే సరుకులు గోడౌన్ నుంచి రిలీజ్ అయ్యేలా పెట్టిన నిబంధనలను కొంచెం సడలించాలని విజ్ఞప్తి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఆగస్టు మాసంలో మూడు నెలల బియ్యం సరఫరా ప్రారంభం కావడంతో ప్రతి నిత్యం ఎంఎల్ఎస్ పాయింట్లను సందర్శించి బియ్యం సరఫరా సక్రమంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ నెల రేషన్ దుకాణాలకు 59 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, ఎంఎల్ఎస్ పాయింట్లకు ఇతర ప్రాంతాల నుంచి లారీలు వచ్చేలా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా సకాలంలో జరిగేలా చూడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.