హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసం, కార్యాలయాలతోపాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈడీ సోదాలు నిర్వహించి రెండేండ్లు గడిచినా ఇప్పటివరకు ఆ వివరాలు ఎందుకు బయటపెట్టలేదని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. నాటి దర్యాప్తు వివరాలను ఇకనైనా వెల్లడించాలని కోరుతూ బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు వివేకానంద్‌గౌడ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రెడ్డి, పార్టీ నాయకులు తలసాని సాయి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈడీ కార్యాలయంలోకి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను తొలుత పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో బయటనే బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వివేక, సంజయ్ మాట్లాడుతూ.. పొంగులేటి ఇంట్లో కోట్లకు కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు వాటి గురించి లెక్కలు చూపరని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, మోదీ దోస్తానాతోనే పొంగులేటి బయటపడ్డారని, రేవంత్, పొంగులేటిపై ఈడీ అధికారులు నిజాయితీగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించడం, అక్రమంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలీసులకు నచ్చజెప్పారు. అనంతరం ఈడీ అధికారులను కలిసి లేఖ అందించేందుకు పోలీసులు అనుమతించారు.
2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరిగిన ఈడీ సోదాలకు రెండేండ్లు పూర్తయిన నేపథ్యంలో, ఇప్పటివరకు దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టత ఇవ్వాలని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ స్వాతికి సమర్పించిన లేఖలో బీఆర్ఎస్ కోరింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరింది. సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న వస్తువులు, తదుపరి దర్యాప్తు చర్యలపై స్పష్టమైన సమాచారం ఎందుకు వెల్లడించలేదని బీఆర్ఎస్ బృందం ప్రశ్నించింది. నారాయణపూర్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్, వట్టినాగులపల్లి ఎఫ్ఐఆర్, కొత్వాల్‌గూడ-మానస హిల్స్‌కు సంబంధించిన అంశాలను కూడా లేఖలో ప్రస్తావిస్తూ, ఆయా వ్యవహారాల్లో దర్యాప్తు పురోగతి ఏమిటో వెల్లడించాలని బీఆర్ఎస్ కోరింది. తాము అడిగిన వివరాలను 15 రోజుల్లోగా వెల్లడించాలని విజ్ఞప్తిచేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లయితే, తదుపరి చర్యలకు సంబంధించిన కాలపరిమితిపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరింది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నదే తమ అభిప్రాయమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.