న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధానాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. సోమవారం ఆయన ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ మూలాలను నెమరువేసుకున్నారు. ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగతం గా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చి లోపాయికారీ రాజకీయాలను బటయపెట్టా రు. ఒకవైపు మోదీతో అంటకాగుతూనే, మరోవైపు రాష్ట్రానికి నిధులు తేలేక ఫెయిల్ అయ్యానని తన అసమర్థతను ఒప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏఐసీసీ అధిష్ఠానం సాక్షి గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ని శాసిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తాను ఇప్పటికీ ఏబీవీపీ మనస్తత్వంతోనే ఉన్నానని చాటిచెప్పారు. ‘నేను ఒక ఏబీవీపీ కార్యకర్తగా చెప్తున్నా.. మోదీ నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రజల మనసులు గెలవాలి’ అంటూ బీజేపీకి సలహాలు ఇవ్వడం కాంగ్రెస్ పెద్దలను విస్మయానికి గురిచేసింది. తెలంగాణలో కాం గ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ప్రభావం శూన్యమని, ఇక డ ఏబీవీపీ నాయకులే కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యేలు అవుతారని చెప్ప డం సొంత పార్టీ క్యాడర్‌ను తాకట్టుపెట్టేలా వ్యాఖ్యానించడమేనని ఎన్ఎస్యూఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సీఎం నోట ఏబీవీపీ భజన రావడం వెనుక ఉన్న అంతర్గత ఒప్పందాలేమిటో బయట పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రీజినల్ రింగు రోడ్డు, మెట్రో రైల్, జాతీయ రహదారుల నిధుల సాధనలో చేతులెత్తేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీతో తన వ్యక్తిగత బంధం మాత్రం ఎంతో బాగున్నదని కితాబిచ్చుకోవడంపై గాంధీభవన్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. మోదీతో వ్యక్తిగతంగా బాగానే ఉంటానని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. మరి రాష్ట్రానికి రావాల్సిన హకులను ఎందుకు సాధించలేకపోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
నాటి ప్రధాని మన్మోహన్సింగ్ గుజరాత్‌కు ఇచ్చినంత సహకారం మోదీ తెలంగాణకు ఇవ్వడం లేదని, నిధులు సాధించడంలో తాను ఫెయిల్ అయ్యానని అసమర్థ ప్రకటన చేస్తూనే.. మరోవైపు ‘గడరీ చేతిలో ఏమీ లేదు, అంతా మోదీ దగ్గరే ఉన్నద’ని చెప్పడం కేవలం నెపం కేంద్రంపైకి నెట్టి తప్పించుకొనే ఎత్తుగడ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
‘మేం ద్రావిడులం, వాళ్లు ఆర్యులు.. మేం శివ భక్తులం, వాళ్లు రామ భక్తులు.. రాముడు సంపన్నుల దేవుడు, శివుడు పేదల దేవుడు’ అంటూ హిందూ సమాజంలో దేవుళ్ల మధ్య సైతం వర్గపోరాటాన్ని సృష్టించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న రాజకీయ అకసును వెళ్లగకేందుకు లక్షలాది మంది నిరుపేద ఐటీఐ విద్యార్థులను కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఐటీఐల్లో కేవలం అంబాసిడర్ కార్ల రిపేర్ మాత్రమే నేర్పిస్తున్నారని, ఆ కార్లు ఇప్పుడు కేసీఆర్ దగ్గర తప్ప ఎకడా లేవని ఎద్దేవా చేశారు.
అసలు కార్ల రిపేర్ కోసమే ఐటీఐ సిలబస్ ఉన్నట్టు, అందుకోసమే సిలబస్‌ను రద్దు చేయాలని ఆదేశించానంటూ సాంకేతిక విద్యను నమ్ముకున్న గ్రామీణ యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం మాట్లాడటంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అభివృద్ధి, నిధుల సాధనలో విఫలమై, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గాలికొదిలేసి ఏబీవీపీ, మోదీ నామజపం చేస్తున్న రేవంత్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.