మేడ్చల్, ఆగస్టు1(నమస్తే తెలంగాణ) : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు లో మాత్రం నిబంధనలు పెట్టడటంతో ఇందిరమ్మ ఇండ్లకు నిరుపేదలు దూరమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తులు చేసుకునేందుకు రూ. 10వేల రుసుమును నిబంధనలో చేర్చడమే నిరుపేదలకు శాపమైంది. రూ.10వేల నిబంధనతో ఇక ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు కలగానే మిగలనుంది. పది వేల రుసుం చెల్లించలేక నిరుపేదలు దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈనెల 10 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం విధితమే. పది వేల రుసుం చెల్లించలేని నిరుపేదలు ఏమి చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పు చేసి దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కచ్చితంగా మంజూరు అవుతాయన్నదానికీ గ్యారెంటీ లేకుండాపో యింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 480 చొప్పున జీప్లస్ 10లో 1,920 ఇండ్లను మం జూరు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. నియోజకవర్గానికి 480కి మించి దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధ్దతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన లబ్ధ్దిదారుడు మరో రూ. 6లక్షలు చెల్లిస్లే ఇందిరమ్మ ఇంటిని కేటాయించేలా ప్రొసిడింగ్ జారీ చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అర్హులైన నిరుపేదలు దరఖాస్తుకు పది వేల రుసుం కట్టడమే భారంగా ఉన్న నేపథ్యంలో ఇల్లు మంజూరైతే మరో రూ. 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకరావాలన్న ఆందోళన ఇప్పటి నుంచే నిరుపేదలలో ప్రారంభమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్భాటంగా ప్రజపాలన కార్యక్రమం నిర్వహించి ఇందిరమ్మ ఇంటి పథకానికి దరఖాస్తులను స్వీకరించి ఎంతో హంగామా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు ఇప్పుడు మరుగున పడవేయటం ఏంటని నిరుపేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్లను అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తేనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం ఏంటని ప్రభుత్వ తీరుపై నిరుపేదలు మండిపడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన అర్హులైన నిరుపేదలకు 38వేల ఇండ్లను అందించన విషయాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన మరో రూ. 6 లక్షలు చెల్లించే నిబంధనపై అనేక విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తులకు పది వేల రుసుంపై చెల్లించడంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరుపేదలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి నిబంధనలను తొలగించి అర్హులైన నిరుపేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.