హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనర్హత నుంచి తప్పించుకొనేందుకు దానం నాగేందర్ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరసరించిందని, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థిస్తూ స్పష్టమైన నిర్ణయం వెలువరించిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజల మద్దతును కాజేయాలని రాహుల్, రేవంత్ భావించారని విమర్శించారు. స్పీకర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఫిరాయింపుదారులను కాపాడుకోవచ్చన్న యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు.
ఖైరతాబాద్ ప్రజలు త్వరలో తమ తీర్పును ఇవ్వబోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మూడేండ్ల మోసం, విఫలమైన హామీలు, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోవడం, పాలనా వైఫల్యాలపై స్పష్టమైన తీర్పును చెప్పనున్నారని తెలిపారు. దానం నాగేందర్ అనర్హతతో ఒక వికెట్ పడిందని, ఇక ముందు మరిన్ని వికెట్లు పడుతాయని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా మాట గుర్తుపెట్టుకోండి.. ఎమ్మెల్యేల చోర్’ అంటూ ఘాటుగా విమర్శించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఈసీ పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు మెజారిటీ అంటే ఇదే కదా.. ఇప్పుడు దాని నిర్వచనం కూడా మారుతున్నదా? అని నిలదీశారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే.. ‘అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?’ అని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు.
‘సర్’ ప్రక్రియలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లోనే అత్యధిక ఓట్ల తొలగింపులు ఉండటం ఆశ్చర్యం కలిగించలేదు’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఒకే పోరాటం జరుగుతున్నదని.. ఒకవైపు కేసీఆర్, మరోవైపు మిగతా అందరు ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి అనైతిక, అక్రమ, బహిరంగంగా ప్రకటించని కుమ్మకు రాజకీయాలకు పాల్పడ్డాయని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఆ కుమ్మకులోకి ఎన్నికల సంఘం కూడా చేరుతున్నట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై గణేశ్ శోభాయాత్రలో కేసీఆర్ పాటలకు యువత ఊగిపోతున్నది. ‘దేఖ్లేంగే’ వైబ్స్ ఆ ప్రాంతానికి ఉర్రూతలూగిస్తున్నది. ఈ క్రమంలో కేటీఆర్ గురువారం ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓ వైపు కేసీఆర్ నిర్మించిన సచివాలయం, మరోవైపు దేశంలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం.. మధ్యలో హుస్సేన్‌సాగర్‌లో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఐకానిక్ ల్యాండ్ మార్లు కనిపించేలా ఉన్న దృశ్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘దేఖ్లేంగే’ వైబ్, ఐకానిక్ ల్యాండ్మార్లు కనిపిస్తున్నాయి.. హైదరాబాద్‌లో ఈ సమయంలో నాకు తెలిసిన ఒకరు మాత్రం సంతోషంగా లేరు’ అని ఎద్దేవా చేశారు.