ఆదిబట్ల, సెప్టెంబర్ 24 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకుర్దు-ఏ గ్రామంలోని భూ బాధిత రైతులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు హామీ ఇచ్చారు. త్వరలోనే కొంగరకుర్దు-ఏ గ్రామంలో పర్యటించి భూములను పరిశీలిస్తానని తెలిపారు. గ్రామంలో దాదాపు 400 ఎకరాలకుపైగా భూములను ఆక్రమించుకొని వెంచర్లు వేస్తున్న విషయమై గురువారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘బకాసుర నేతలు.. బికారీలే బినామీలు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో భూ బాధిత రైతులు మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి తమ సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి రైతులతో మాట్లాడారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగారెడ్డి కలెక్టర్ సీ నారాయణరెడ్డి, శంషాబాద్ జోన్ డీసీపీ బీ రాజేశ్, ఆదిబట్ల సీఐ రమేశ్‌కు ఫోన్‌చేసి.. రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. రైతులకు అండగా ఉండాల్సిన పోలీసులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతారా? అని నిలదీశారు.
గతంలో ఓ ఐఏఎస్ అధికారి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కనీసం విచారణ ఎందుకు చేపట్టలేదని అడిగారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. బాధిత రైతులు శనివారం ఉదయం వచ్చి తనను కలువాలని, వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం సదరు రైతులు నేరుగా హెచ్ఎండీఏ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యపై ఫిర్యాదు చేశారు. అక్రమంగా వెంచర్లకు అనుమతులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని అధికారులను కోరారు. హరీశ్‌రావును కలిసిన వారిలో బాధిత రైతులు భూపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్, యాదిరెడ్డి, నరసింహతోపాటు మరికొందరు ఉన్నారు.