సూర్యాపేట, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా అధికారంలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న అబద్ధాలు పటాపంచలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నాడు నిర్మించిన లిఫ్ట్‌లను ఆన్‌చేసి నీళ్లు పారించి, అవి కాళేశ్వరం జలాలు కాదు.. శ్రీరాంసాగర్ జలాలే అని అబద్ధపు ప్రచారం చేశారు. సుమారు యాభై ఏండ్ల క్రితం నిర్మించిన శ్రీరాం సాగర్ నుంచి చుక్కనీరు కూడా ఎరుగని సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తరువాతే గత ఏడేనిమిదేండ్లుగా గోదావరి జలాలు పారాయి. గత రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏదీ నిర్మించలేదు. ఒక్క తూము కూడా ఏర్పాటు చేయలేదు. కానీ రెండున్నరేండ్లుగా వర్షాలు పడుతూ కాలం కలిసి వస్తుండటంతో సూర్యాపేటకు శ్రీరాంసాగర్ నుంచే నీళ్లు వస్తున్నాయంటూ అబద్ధపు ప్రచారం చేశారు. ఈ ఏడాది వర్షాభావంతో కరువు అలుముకుంది. దీంతో తాజాగా లిఫ్ట్‌లను ఆన్ చేసి శ్రీరాంసాగర్‌కు నీటిని తరలిస్తున్నారు. కాగా సూర్యాపేటకు మాత్రం నీళ్లివ్వమని చెబుతుండటంతో ఈ ప్రాంత రైతులకు గుబులు తెప్పిస్తోంది.
బీఆర్ఎస్ డిమాండ్ చేసినట్లు నెల క్రితమే లిఫ్ట్‌లు ఆన్ చేసి ఉంటే, ఇప్పటికే సూర్యాపేటకు నీళ్లు చేరేవి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా సూర్యాపేటకు వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లే అయితే యాభై ఏండ్లుగా ఎందుకు రాలేదు..? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తరువాతే ఎందుకు వస్తున్నాయో తెలుసుకోలేనంత అజ్ఞానంలో తెలంగాణ సమాజం, రైతులు లేరు. రెండున్నరేండ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన నంది మేడారం, గాయత్రి పంపుహౌస్‌లను ఆన్‌చేసి జిల్లాకు నీటిని పారిస్తూ వాటినే శ్రీరాంసాగర్ నీళ్లని చెబుతూ వస్తున్నారు. మోటార్లు ఆన్ చేశారనే విషయం అక్కడి మోటార్ల మీటర్ రీడింగులే చెబుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కుట్రలు తెలుసుకోలేనంత అమాయకులు ఎవరూ లేరని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఒక్కసారి కూడా సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు రాలేదని, ఆయకట్టు పరిధిలోని ఏ రైతును అడిగినా చెబుతారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 2018 నుంచి ఏటా రెండు పంటలకు సరిపడా నీళ్లు రావడంతో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో వరి పండింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక మునుపు జిల్లాలోని 2.90 లక్షల ఎకరాల గోదావరి జలాల ఆయకట్టుకు గాను 18 నుంచి 20 వేల ఎకరాలకు మించి వరి పండక పోయేది. 2018 నుంచి వంద శాతం వరి సాగవుతూ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. ఇప్పటి వరకు 20 వేల ఎకరాలకు మించి నాట్లు పడకపోవడం గమనార్హం.
ఈ ఏడాది వర్షాలు పడక కరువు ఛాయలు అలుముకోవడంతో అన్ని రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఈ క్రమంలో సూర్యాపేటకు నీళ్లు రావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లిఫ్ట్‌లను ఆన్ చేయడం ఒక్కటే మార్గం. కానీ కాళేశ్వరం కూలింది ఆ లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం కుదరదు.. అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం విదితమే. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో లిఫ్ట్‌లను కచ్చితంగా ఆన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నా అబద్ధాలతో దుష్ప్రచారం చేసిన నేపథ్యంలో తాము రైతులు, ప్రజల్లో విశ్వసం కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లను ఆన్ చేయలేదు. మరో పక్క కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్కు అప్పగిస్తే పది రోజుల్లో నీళ్లు పారించి చూపుతామని ఆ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. దీనికి తోడు గోదావరి ఆయకట్టు కింద సూర్యాపేట జిల్లా మాత్రమే కాకుండా మొత్తం ఆయకట్టు కింద ఉన్న భూములు బీళ్లుగా మారి, ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో బుధవారం లిఫ్ట్‌లు ఆన్ చేశారు. దీంతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయి.
సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాల్లో చుక్క కూడా రాదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని గత నెల 25న ఇరిగేషన్ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సూర్యాపేటకు నీళ్లు వచ్చేందుకు ఎగువన ఉన్న నంది మేడారం, లక్ష్మీ పంపులను ఆన్ చేశారు కదా.. ఇప్పుడైనా నీళ్లు వస్తాయా అని అధికారులను అడిగితే శ్రీరాంసాగర్ నింపేందుకు చాలా సమయం పడుతుంది.. దిగువన ఉన్న సూర్యాపేటకు రావని తేల్చి చెప్పారు. ఒక వేళ ముందుగా పంపులు ఆన్ చేసి ఉంటే ఖచ్చితంగా సూర్యాపేటకు గోదావరి జలాలు వచ్చేవని చెబుతున్నారు. గత నెల రోజులుగా లక్షలాది క్యూసెక్కుల నీళ్లు దిగువకు వృధాగాపోతున్నా మోటార్లు ఆన్ చేయని ప్రభుత్వం నేడు కేవలం రైతులు, ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి లిఫ్ట్‌లను ఆన్ చేసిందనేది సుస్పష్టం. సీజన్ ఆలస్యమైనా ఫర్వాలేదు… లిఫ్ట్‌లను కొనసాగిస్తూ నీళ్లను సూర్యాపేటకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రెండున్నరేండ్లుగా ప్రతి సీజన్లో కాళేశ్వరం పరిధిలోని లిఫ్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ చేసి సూర్యాపేట జిల్లాకు నీళ్లు ఇచ్చేది. లిఫ్ట్ మోటార్లు ఆన్ చేశారనేందుకు విద్యుత్ బిల్లులే సాక్ష్యం. బీఆర్ఎస్ పోరాటంతో గత్యంతరం లేకనే లిఫ్ట్ మోటార్లు ఆన్ చేశారు. మరి కాళేశ్వరం కూలిందంటూ ప్రచారం చేసి, ఇప్పుడు మోటార్లు ఆన్ చేసిన ప్రభుత్వ కుట్రలు, దుష్ప్రచారాలకు కాంగ్రెస్ వారే సమాధానం చెప్పారు. యాభై ఏండ్లుగా సూర్యాపేట జిల్లాకు రాని శ్రీరాంసాగర్ నీటిని వారేదో కొత్తగా చేసినట్లు, అందువల్లనే సూర్యాపేటకు నీళ్లు వస్తున్నాయని, పంటలు పండుతున్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ రావడం సిగ్గు చేటు. కాంగ్రెస్ పార్టీనే అత్యధిక కాలం అధికారంలో ఉంది… ఏనాడూ వర్షాలు పడి శ్రీరాం సాగర్‌లోకి నీళ్లు రాలేదు.. అప్పుడు ఎందుకు జిల్లాకు నీళ్లు ఇవ్వలేదు.. దశాబ్దాల తరబడి ఎడారిగా ఉన్న జిల్లాలోని గోదావరి ఆయకట్టు కాళేశ్వరం జలాల రాకతో పచ్చని మాగాణమైంది. జిల్లా నుంచి ఉద్యమం ప్రారంభం కాకముందే ఆన్ చేసిన లిఫ్ట్‌ల ద్వారా జిల్లాకు జలాలు సరఫరా చేయాలి. అబద్ధాలు… మోసాలతో అధికారంలోకి వచ్చినా కనీసం ఉన్నంతలో ప్రజలకు మంచి చేయాలే తప్ప నీచ రాజకీయం చేసి, రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడడం ప్రభుత్వానికి మంచిది కాదు. రైతులు కన్నెర్ర చేస్తే మాడి మసై పోతారు.
కాళేశ్వరం కట్టినంకనే మాకు నీళ్లు వచ్చినై. అంతకు మునుపు ఎన్నడూ రాలే. కేసీఆర్ కట్టిన లిఫ్ట్‌లు ఆన్ చేస్తే వెంటనే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వీడియోలో కుల్లంకుల్లం చెప్పిండు. అది అందరికీ అర్థమైంది. అందుకే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం లిఫ్ట్‌లను ఆన్ చేసిందనుకుంటున్నా. రాజకీయాల కోసం మా రైతులను నట్టేట ముంచుతారా. ఏం చేస్తరో తెల్వదు మాకైతే నీళ్లు రావాలె. లేదంటే రైతులంటే ఏంటో చూపించి తీరుతం.