Rahul vs BJP : పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) లో రాజకీయ వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా హీటెక్కింది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) సందర్భంగా కర్ణాటకలోని మహదేవ్పుర (Mahadevpura), రాజాజీనగర్ (Rajaji Nagar) లో ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కు (Freedom park) లో అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ (BJP) ప్రతిదాడికి దిగింది. దాంతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ పార్కులో ఆందోళన మొదలుపెట్టడానికి కొన్ని గంటల ముందు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి 13 ప్రశ్నలు సంధిస్తూ బీజేపీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసింది. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు చెందిన మహర్షి వాల్మీకి (Maharshi Valmiki) కార్పోరేషన్‌కు సంబంధించిన రూ.187 కోట్లను దుర్వినియోగం చేసిందని బీజేపీ విమర్శించింది.
మహర్షి వాల్మీకి స్కీమ్ నిధులు కర్ణాటకలోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారి సంక్షేమం కోసం కేటాయించబడ్డాయని, ఆ నిధులను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మళ్లించిందని బీజేపీ ఆరోపించింది. ఈడీ పరిశీలనలో ఈ విషయం రుజువైందని తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మంత్రి బీ నాగేంద్రతో రాజీనామా చేయించడం తప్ప మరెలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ విమర్శించింది.
షెడ్యూల్డ్ తెగల వారికి సంబంధించిన సంక్షేమ నిధులను దారిమళ్లించినందుకు నువ్వు వారికి క్షమాపణ చెబుతావా..? అని రాహుల్‌గాంధీని బీజేపీ ప్రశ్నించింది. ఈ అంశానికి సంబంధించి రాహుల్‌గాంధీకి బీజేపీ మొత్తం 13 ప్రశ్నలు సంధించింది. వాటన్నింటికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.