Rahul Gandhi : భారత ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు (Right to vote) పై మీరు దాడిచేస్తే, మీపై మేం దాడి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ను హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం బెంగళూరు (Bengalore) లోని ఫ్రీడమ్ పార్క్ (Freedom park) లో నిర్వహించిన నిరసన సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ఇది కేవలం తన గొంతుక కాదని, యావత్ హిందుస్థాన్ గొంతుక అని స్పష్టం చేశారు. ఎన్నికల మోసం ఫిర్యాదుపై తన నుంచి ఈసీ అఫిడవిట్ కోరిందని, కానీ తాను ఇప్పటికే లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రమాణం చేశానని రాహుల్ గుర్తుచేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రం ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అని, ఈసీ అధికారులు దానిపైనే దాడి చేస్తున్నారని విమర్శించారు. మీరు పేదలపై దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో మోసం చేసి సులభంగా తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటని, సమయం పట్టినా మిమ్మల్ని ఒక్కొక్కరిగా పట్టుకుంటామని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.
బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక్క మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌పై మాత్రమే తాము దృష్టి సారించామని, అక్కడ బీజేపీ, ఈసీ కుమ్మక్కై మోసానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. మహాదేవపురలో మొత్తం 6.5 లక్షల ఓటర్లు ఉంటే, అందులో 1.25 లక్షల ఓట్లను దొంగిలించారని, అంటే ప్రతి ఆరుగురిలో ఒక ఓటును తారుమారు చేశారని రాహుల్‌గాంధీ చెప్పారు. ఈ మోసం ఐదు ప్రధాన పద్ధతుల్లో జరిగిందని ఆరోపించారు.
1. సుమారు 12,000 మంది నకిలీ ఓటర్లు ఐదారు పోలింగ్ బూత్‌లలో ఓటు వేశారు.
2. దాదాపు 40,000 ఓట్లను నకిలీ ఐడీలతో నమోదు చేశారు.
3. ఒకే ఇంటి చిరునామాపై వందల ఓట్లు నమోదు చేశారు. ఒక బీజేపీ నేత ఇంట్లో 40 మంది ఓటర్లు ఉన్నట్లు చూపగా, తాము వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు.
4. దాదాపు 4,000 మంది ఓటర్లకు ఫొటోలు లేవని, ఉన్నా అవి అస్పష్టంగా ఉన్నాయి.
5. ఫారం 6 ద్వారా కొత్తగా చేర్చిన 34 వేల ఓట్లలో చాలామంది 89 నుంచి 95 ఏళ్ల మధ్య వయసు వారే ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
వీటిపై రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ రాజ్యాంగం కోసం పనిచేయాలికానీ బీజేపీ కోసం కాదని హితవు పలికారు. దేశవ్యాప్త ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాను, పోలింగ్ వీడియో రికార్డింగ్‌లను విడుదల చేస్తే ఈ మోసం కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా జరిగిందని నిరూపిస్తామని రాహుల్ సవాల్ విసిరారు. ఈ పోరాటంలో తాను ఒంటరిని కాదని, దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఈ ప్రశ్న లేవనెత్తుతున్నాయని, ఈసీ వెంటనే డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.