Monalisa | ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సమయంలో అమాయకపు చిరునవ్వుతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారిన యువతి మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. కుంభమేళా సందర్భంగా పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఆమె వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ఈ యువతి తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టడం కూడా విశేషంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య తిరువనంతపురంలో పోలీసుల రక్షణ మధ్య ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని, అనంతరం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ వివాహంపై ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇది ప్రేమ వివాహం కాదని, “లవ్ జిహాద్”లో భాగమని కూడా వ్యాఖ్యానించారు. సనోజ్ మిశ్రా మాట్లాడుతూ, మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చానని చెప్పారు. ఆమె జీవితాన్ని మార్చేందుకు తాను ఎంతో కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని, సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు సినిమాల ఒప్పందాలు కూడా అతడే చేయించాడని ఆరోపించారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా నిరాశకు గురిచేశాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం మోనాలిసా వివాహం చుట్టూ వివాదం వేడెక్కుతున్నప్పటికీ, దర్శకుడు చేసిన ఆరోపణలపై మోనాలిసా గానీ, ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారంలో అసలు నిజం ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు మోనాలిసా పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారుతున్నాయి. కుంభమేళా వైరల్ గర్ల్‌గా గుర్తింపు పొందిన ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఈ తాజా పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.