Spirit | సోషల్ మీడియాలో స్టార్ హీరోలతో సంబంధం ఉన్న చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించిన వార్తలు అయితే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. తాజాగా ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం స్పిరిట్‌కు సంబంధించినట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఆ ఫోటో అసలు ప్రభాస్ది కాదని ఓ నటుడు స్పష్టంచేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో వేగంగా వైరల్ అయింది. ఆ ఫోటోలో ఒక వ్యక్తిని వెనక నుంచి తీసినట్లు కనిపిస్తోంది. ముఖం స్పష్టంగా కనిపించకపోయినా, వెనుక నుంచి చూసినప్పుడు లుక్స్ మాత్రం ప్రభాస్‌ను గుర్తు చేస్తున్నాయని చాలామంది భావించారు.
ముఖ్యంగా హెయిర్ స్టైల్, శరీరాకృతి, స్టైల్ కలిపి చూస్తే అది ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో కనిపించే లుక్ కావచ్చని కొందరు నెటిజన్లు అనుకున్నారు. దీంతో ఇదే ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వైరల్ చేశారు. కొంతమంది అభిమానులు కూడా ఈ ఫోటోను నిజమని భావించి విస్తృతంగా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోపై తాజాగా నటుడు శివ గణేష్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. వైరల్ అవుతున్న ఫోటో ప్రభాస్ది కాదని, అది తనదేనని వెల్లడించాడు. శివ గణేష్ మాట్లాడుతూ.. ఆ ఫోటో ఇటీవల నేను ఒక సినిమా షూటింగ్ సమయంలో దిగింది. నేను నా సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాను. కానీ అది ఎలా ప్రభాస్ ఫోటోగా వైరల్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు. వెనక నుంచి చూస్తే కొంచెం లుక్స్ అలాగే ఉన్నాయని చాలామంది అంటున్నారు” అని చెప్పాడు.
నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ మెసేజ్ చేసి ఈ ఫోటోని పంపించారు. ఇది ప్రభాస్ స్పిరిట్ లుక్ అని ట్విట్టర్లో వైరల్ అవుతోంది అని చెప్పారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. కానీ ఆ ఫోటో మాత్రం నాదే, ప్రభాస్ది కాదు అని స్పష్టం చేశాడు. శివ గణేష్ ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ముఖ్యంగా పుష్ప: ది రైజ్, ఆర్ఆర్ఆర్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు.