సింగపూర్: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న వేళ సింగపూర్‌కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నాట్య నివేదన సమర్పించేందుకు తిరుమలకు విచ్చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సౌజన్యంతో శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ (SSKS) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. సింగపూర్‌కు చెందిన అభినయ నాట్యాలయ – ప్రత్యూష అవధానుల శిష్యబృందం, మాతృశ్రీ సాయి అకాడమీ – నిషిత యాబాజీ శిష్య బృందంకు చెందిన 22 మంది కూచిపూడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గురువులతో కలిపి సుమారు 45 మంది ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా.. తిరుమల మాడవీధుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సింగపూర్ బృందం కూచిపూడి నృత్యంతో నాట్య నివేదన సమర్పించనుంది. విదేశాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయ కళలను అభ్యసిస్తున్న యువ కళాకారులు తమ సొంత ఖర్చులతో భారత్‌కు వచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాట్య సేవ చేయడం విశేషం. ముఖ్యంగా సింగపూర్, జర్మనీ నుంచి కళాకారులు తొలిసారిగా స్వీయ ఖర్చులను భరించి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని నాట్య నివేదన సమర్పించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకు రానుంది.
ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొనే కళాకారులకు వీఐపీ దర్శనం, లడ్డూ ప్రసాదాలతో పాటు స్థానిక రవాణా సదుపాయాలను టీటీడీ అందించనుంది. విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరానికి మన సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్య సంప్రదాయాలను పరిచయం చేసి, వాటిని కొనసాగించేలా ప్రోత్సహించడమే శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ ప్రధాన లక్ష్యాలలో ఒకటని సంస్థ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు తెలిపారు. ఈ నాట్య నివేదన కార్యక్రమాన్ని SVBC ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించవచ్చు. సెప్టెంబర్ 19న సాయంత్రం 6:00 గంటలకు , సెప్టెంబర్ 20న ఉదయం 8:00 గంటలకు తిరుమల మాడవీధుల్లో సమర్పించనున్న సింగపూర్ నృత్య కళాకారుల నాట్య నివేదనను భక్తులు వీక్షించి, కళాకారులను ఆశీర్వదించాలని నిర్వాహకులు కోరారు.